బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు బలవంతపు పెళ్లి జరుగుతున్నట్టుగా వుంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపడం లేదు. పైగా బీజేపీతో పొత్తు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలను నింపుతోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి కొత్తగా ఒనగూరే ప్రయోజనాలేంటో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అందుకే ఎన్డీఏలో టీడీపీ చేరుతుందనే వార్తల్ని అయిష్టంగా ఎల్లో మీడియా రాయడాన్ని గమనించొచ్చు. ఇటీవల కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్‌షాతో చంద్రబాబునాయుడు చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో టీడీపీ చేరిక ముహూర్తాన్ని ఎల్లో మీడియా ఖరారు చేసింది. ఈ వారంలో మరోసారి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎన్డీఏలో చేరికపై అధికారిక ప్రకటన చేస్తారని ఎల్లో మీడియా వెల్లడించింది.
బీజేపీతో జనసేన మిత్రపక్షమన్న సంగతి తెలిసిందే. ఇటు టీడీపీతోనూ జనసేన పొత్తు కుదుర్చుకుంది. వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే జనసేన రెండిళ్ల పూజారి. టీడీపీ, బీజేపీలతో పొత్తు జనసేనకు ఏ రకంగా చూసినా లాభమే. అందుకే ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తన ఇష్టానుసారం నడుచుకుంటున్నారు.
ఇప్పుడు సమస్యల్లా టీడీపీకే. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాల ఓట్లను శాశ్వతంగా పోగొట్టుకోవాల్సి వుంటుందని టీడీపీ భయపడుతోంది. దీని వల్ల రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. అందుకే ఎన్డీఏలో చేరడానికి టీడీపీ అయిష్టంగానే అడుగులు ముందుకేస్తోంది. అలాగని బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే వైసీపీని ఎదుర్కోలేమని చంద్రబాబు భావిస్తున్నారు.
ఒక్కసారి తమ జుట్టు బీజేపీ చేతికిస్తే ఏమవుతుందో అని టీడీపీ ఆందోళన చెందుతోంది. బీజేపీ డిమాండ్స్ ఎలా వుంటాయో అనే బెంగ చంద్రబాబును పట్టుకుంది. అయినప్పటికీ రాజకీయ అవసరాల రీత్యా ఎన్డీఏలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు వివరణ ఇచ్చుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనూ కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉన్నారని, పొత్తు పెట్టుకున్నంత మాత్రాన రాజకీయంగా టీడీపీకి మాత్రమే ప్రత్యేకంగా ప్రయోజనాలు కలిగిస్తారనే నమ్మకం ఏంటని టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీతో కలిసి ప్రయాణించడం తమ పార్టీ శ్రేణులకి ఏ మాత్రం ఇష్టం లేదని తెలుసు కాబట్టే, చంద్రబాబు కూడా ఆనందంగా లేరు. బీజేపీతో టీడీపీకి బలవంతపు పెళ్లి జరుగుతోందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్నోళ్లకు ఎలాంటి ఫీలింగ్ లేకపోవచ్చు కానీ, టీడీపీ మనసు మాత్రం ఎందుకో బాధతో మూలుగుతోందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.