వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఇటీవల కాలంలో కామెడీ చేస్తున్నారు. హాస్యం ఎక్కువ పండిస్తూ, తెలుగుదేశం పార్టీని అపహాస్యం చేస్తున్నారని ఆ పార్టీ పెద్దలు ఆగ్రహించారు. దీంతో ఆయన్ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఆర్.శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన జారీ చేశారు.
మల్లెల లింగారెడ్డికి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం గమనార్హం. దీంతో కడప జిల్లా టీడీపీ రాజకీయాల గురించి నోరెత్తకుండా టీడీపీ కట్టడి చేసినట్టైంది. ప్రొద్దుటూరు టికెట్‌ను లింగారెడ్డి ఆశిస్తున్నారు. అయ్యా నీకు అంత సీన్ లేదని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, సీఎం సురేష్‌నాయుడితో పాటు మరికొందరు ప్రొద్దుటూరు టికెట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల లింగారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరదరాజులరెడ్డికి టికెట్ ఇస్తే, తాము సన్యాసం తీసుకోవడమా? లేక నక్సలైట్లలో చేరడమా?…ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. వరదకే టికెట్ ఇస్తే వైసీపీ 72 వేల మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
ప్రొద్దుటూరు టీడీపీలో అసమ్మతి రాగం రోజురోజుకూ శ్రుతి తప్పుతుండడంతో అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. మల్లెల లింగారెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. దీంతో జిల్లా రాజకీయాలపై లింగారెడ్డి మాట్లాడకూడదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. లింగారెడ్డి స్థానంలో కడప లోక్‌సభ అభ్యర్థి ఆర్.శ్రీనివాస్‌రెడ్డిని నియమించడం విశేషం.