చంద్రబాబునాయుడిని భవిష్యత్ భయపెడుతోంది. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు చివరికి ఏం చేస్తాయో అనే ఆందోళన ఆయన్ను వెంటాడుతోంది. పొత్తుల్లో భాగంగా త్యాగాలకు సిద్ధపడాలని, టికెట్లు రానివారికి, అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తానని ఆయన నమ్మబలుకుతున్నారు. అయితే చంద్రబాబు మాయ మాటల్ని నమ్మేంత అమాయకులెవరూ లేరు.
వర్తమానమే తప్ప, భవిష్యత్‌లో అది చేస్తాం, ఇది చేస్తామని నాయకులు చెబితే, నమ్మే పరిస్థితి లేదు. పొత్తుల పేరుతో తమ రాజకీయ భవిష్యత్‌ను బలి పెడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదని టీడీపీ నాయకులు ఇప్పటికే హెచ్చరికలు పంపారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజా హెచ్చరిక దేనికి నిదర్శనం? గతంలో చంద్రబాబు సిటింగ్‌లకు సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారని, కావున రాజమండ్రి రూరల్ సీటు తనకే అని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఒకటికి వందసార్లు ఆయన బహిరంగంగానే ప్రకటిస్తుండడం జనసేనకు కోపం తెప్పిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పొత్తుల వల్ల నష్టపోయిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని ఆయన అన్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు కచ్చితంగా గుర్తింపు వుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన పార్టీలకు అంత సీన్ లేదనేది బహిరంగ రహస్యమే. బలమైన కేడర్ ఉన్న టీడీపీ నేతలకు కాకుండా, పొత్తుల పేరుతో ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని బీజేపీ, జనసేన లీడర్లకు టికెట్లు ఇస్తే ఎలా చేయాలనే ప్రశ్న ప్రధాన ప్రతిపక్షం నుంచి వస్తోంది. ఎవరి కోసమో తమ నాయకత్వాన్ని బలి పెట్టాలంటే ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమ వుతోంది. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఇతర పార్టీల నేతలను గెలిపిస్తే, ఆ తర్వాత టీడీపీ కేడర్‌ను ఎందుకు పట్టించుకుంటారనే ప్రశ్న ఎదురవుతోంది.
రాజకీయాల్లో ప్రత్యామ్నాయ లీడర్‌ను ఎదగనించే ప్రశ్నే వుండదని, చంద్రబాబు ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో కేడర్ పని చేసే అవకాశం వుండదనే చర్చకు తెరలేచింది. ఒక పార్టీలోనే ఇద్దరు, ముగ్గురు నాయకులంటే, ఒకరికి టికెట్ ఇస్తే, మరొకరు చేసే పరిస్థితి వుండదని, అలాంటప్పుడు ఇతర పార్టీల నాయకుల గెలుపు కోసం పని చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ, జనసేనలతో పొత్తు కుదుర్చుకున్నంత మాత్రాన కలిసి పని చేయడం అంత సులువు కాదని వారు అంటున్నారు. చంద్రబాబుకు ముందుంది ముసళ్ల పండగ అని టీడీపీ నేతలే హెచ్చరిస్తుండడం గమనార్హం.