రిలీజై వారమైంది.. ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది

రిలీజైన మొదటి రోజే ఫలితం తేలిపోయింది. రెండో రోజుకు స్పష్టమైన ఫలితం కనిపించింది. మొత్తానికి కిందా మీద పడి నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది లాల్ సలామ్ సినిమా. రజనీకాంత్ నటించిన…

రిలీజైన మొదటి రోజే ఫలితం తేలిపోయింది. రెండో రోజుకు స్పష్టమైన ఫలితం కనిపించింది. మొత్తానికి కిందా మీద పడి నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది లాల్ సలామ్ సినిమా. రజనీకాంత్ నటించిన ఈ సినిమా నిన్నటితో పూర్తిస్థాయిలో వాష్ అవుట్ అయింది.

రెండో రోజుకే డిజాస్టర్ అయిన ఈ సినిమాకు వారం రోజుల తర్వాత పంచాయితీ ఎందుకు? తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎందుకంటే, రజనీకాంత్ నటించిన గత చిత్రం జైలర్ కు, ఈ తాజా చిత్రం లాల్ సలామ్ కు ఆకాశానికి-పాతాళానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. వారం రోజుల రన్ తర్వాత ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

జైలర్ సినిమా రిలీజైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వారం తిరిగేసరికి అఖండ విజయాన్ని అందుకుంది. మొదటి వారం ఈ సినిమాకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఇప్పుడు లాల్ సలామ్ విషయానికొద్దాం. ఈ సినిమాకు వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మీరు చదివింది నిజమే. అక్షరాలా 27 కోట్ల రూపాయలు మాత్రమే. జైలర్, లాల్ సలామ్ మధ్య తేడా చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం.

ఫ్లాప్ అయిన సినిమాలు తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ రోజుల్లో, లాల్ సలామ్ ను కూడా మరో 2 వారాల్లో స్ట్రీమింగ్ కు పెట్టాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే నెట్ ఫ్లిక్స్, ఈ సినిమా స్ట్రీమింగ్ ను ఎనౌన్స్ చేయబోతోంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకుంది.