గాజువాక సీటు జనసేనకే కేటాయిస్తారు అని ప్రచారం సాగుతోంది. దాంతో రోజుకొక పేరు ఆ పార్టీ నుంచి బయటకు వస్తోంది. తాజాగా స్టీల్ ప్లాంట్ నాయకుడు ఒకరి పేరు ప్రచారంలోకి వచ్చారు. ఆయనకు టికెట్ ఇస్తే ఆయన వెనక ఉన్న సొంత సామాజిక వర్గంతో పాటు స్టీల్ ప్లాంట్ కార్మికుల మద్దతు కూడా దక్కుతుందని గెలుపు తధ్యమని అంచనా వేస్తున్నారు.
అయితే అదే సీటు మీద ఆశలు పెట్టుకున్న మరి కొందరు నేతలు మాత్రం ఎవరో ఎందుకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది అని సూచిస్తున్నారు. అధినేత మెప్పు కూడా ఆ విధంగా పొందవచ్చు, ఒకవేళ ఆయన రెండు సీట్లలో గెలిస్తే ఉప ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేయవచ్చు అని కొందరు జనసేన నేతలు తెలివైన ఎత్తులు వేస్తున్నారు అని అంటున్నారు.
పవన్ గాజువాకా నుంచి పోటీ చేయాలని నియోజకవర్గం స్థాయిలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పవన్ 2019లో ఓడినా ఈసారి గాజువాక గాజుగ్లాస్ ని ఆదరిస్తుందని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ పోటీ చేస్తే తిరుగు ఉండదని అంటున్నారు.
గతంలో జరిగిన ఓటమికి బదులు తీర్చుకోవడం కోసం అయినా పవన్ పోటీ చేయాలని తాము దగ్గరుండి గెలిపించుకుంటామని అంటున్నారు పవన్ ఆలోచనలు అలా ఉన్నాయా అన్నది తెలియడం లేదు. ఆయన భీమవరంలో పోటీ చేస్తారు అని అంటున్నారు. గోదావరి జిల్లాలలోనే ఈసారి పవన్ పోటీ ఉంటుందని అంటున్నారు. అందుకే విశాఖలో తన సోదరుడు నాగబాబుని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అయితే పవన్ గాజువాక నుంచి పోటీ చేయకపోయినా ఈ తీర్మానం తరువాత అక్కడ తన మనసుకు దగ్గరైన వారికి టికెట్ ఇవ్వవచ్చు అని అంటున్నారు.