రాజకీయాలు అంటే అటు ఆరు తరాలూ ఇటు మూడు తరాలు బయటకు తీస్తారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పదే పదే వాడుకుంటారు. టైం బాండ్ అన్నది ఉండదు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు మీద ఒక తీవ్రమైన ఆరోపణ ఉంది.
ఆయన వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడు అని. దాని మీద అనేక సార్లు ఆయన ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా అదే విమర్శను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయి అయిన వెలగపూడి నీతులు మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
వంగవీటి రంగాను ఆయన ఎలా హత్య చేశారో తాను బయటపెడతాను అని ఎంపీ అంటున్నారు. కల్తీ మద్యం వ్యాపారం చేసి ఎంతో మంది జీవితాలలో ఆడుకున్న వెలగపూడి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. వెలగపూడి అక్రమాల చిట్ట తన దగ్గర ఉందని అన్నారు.
కాపుల ఆరాధ్యుడు రంగాను చంపిన కేసులో ఉండి ఇపుడు జనసేన ఓట్ల కోసం ఆ నాయకుల పంచన చేరడం వెలగపూడికే చెల్లిందని అన్నారు. వెలగపూడి బీసీల వ్యతిరేకి అని కూడా ఎంపీ ఘాటు వ్యాఖ్యలే చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంతో మంది యాదవులను తొక్కేసిన చరిత్ర వెలగపూడికి ఉందని ఆయన మండిపడ్డారు.
అలాంటి వెలగపూడి తన గురించి ఆరోపణలు చేయడం కంటే దారుణం లేదని అన్నారు. ఎంపీ ఎంవీవీ వెలగపూడి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలగపూడిని ఓడిస్తాను అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నాలుగవ సారి గెలవాలని చూస్తున్న వెలగపూడి పట్ల జనంలో అసంతృప్తి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. తూర్పు నియోజకవర్గం లో ఒక్క మేలు చేయని వెలగపూడిని ఈసారి ఓడించడం ఖాయమని అంటున్నారు.