పూరి జగన్నాధ్-రామ్ కాంబినేషన్లో తయారవుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా గతంలో పూరి సినిమాల మాదిరిగా కాకుండా కాస్త ముందు వెనుక అంటూ స్లోగానే తయారవుతోంది. డబ్బుల ఇబ్బందులే కారణం తప్ప మరేం కాదు. ఆ మధ్య ఓ షెడ్యూలు కూడా ఈ కారణంగానే వాయిదా పడిందన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. మొత్తానికి ఇప్పుడు ఆ ఒడిదుడుకులు అన్నీ అధిగమించి ముందుకు సాగుతోంది. నాన్ థియేటర్ అమ్మకాలు జరిగితే ఏ సమస్య లేదు.
ప్రస్తుతానికి విడుదల తేదీని ప్రకటించారు. కానీ అసలు సమస్య విడుదల అన్నదే. ఎందుకంటే పాత పంచాయతీలు చాలా వున్నాయి. లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో బయ్యర్లు అంతా నష్టపోయారు. ఎగ్జిబిటర్లు ఇచ్చిన అడ్వాన్స్ లు బయ్యర్ల దగ్గర ఇరుక్కుపోయాయి. నైజాంలో వరంగల్ శ్రీను కొనుకున్నారు. ఆసియన్ సునీల్, శిరీష్ రెడ్డి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ లు ఇచ్చారు. అవన్నీ వరంగల్ శ్రీను దగ్గర ఇరుక్కున్నాయి.
ఇప్పుడు పూరి జగన్నాధ్ డబ్బులు వెనక్కు ఇస్తే ఎవరికి ఇవ్వాలి అన్నది పాయింట్. వరంగల్ శ్రీనుకా? లేదా శ్రీనుకు అడ్వాన్స్ లు ఇచ్చిన ఆసియన్ సునీల్, శిరీష్ రెడ్డి కా, లేక నేరుగా దిగువ స్థాయి ఎగ్జిబిటర్లకా? ఈ మీమాంస తేలకనే పూరి ఇన్నాళ్లు డబ్బులు వెనక్కు ఇవ్వలేదు. కానీ విడుదల తేదీ నాటికి మాత్రం ఏదో ఒకటి చేయకతప్పదు. ఇవ్వడానికి పూరి సుముఖంగానే వున్నారు. కానీ ఎవరికి ఇవ్వాలనే పంచాయతీ తేలాల్సి వుంది.
నేరుగా ఎగ్జిబిటర్లకు ఇవ్వడం కానీ లేదా ఛాంబర్ కు అప్ప చెప్పి వాళ్లనే తగువు తేల్చమని చెప్పడం కానీ చేయాలన్నది పూరి ఆలోచగా తెలుస్తోంది. మరి వరంగల్ శ్రీను ఏం చేస్తారో అప్పుడు? ఎన్ ఆర్ ఎ పద్దతిన కొనుగోలు చేస్తే చేసేది ఏమీ వుండకపోవచ్చు.