“పుష్ప పార్ట్-3ని కచ్చితంగా ఆశించొచ్చు. ఎందుకంటే, మేం పుష్పను ఓ ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. సీక్వెల్స్ కోసం మా దగ్గర అద్భుతమైన ఆలోచనలున్నాయి. కాబట్టి పుష్ప-3 కచ్చితంగా ఆశించొచ్చు.”
ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వయంగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్. పుష్ప ఫ్రాంచైజీ నుంచి మరిన్ని సీక్వెల్స్ రావొచ్చని, పార్ట్-3 మాత్రం పక్కా అని క్లారిటీ ఇచ్చాడు బన్నీ.
జర్మనీలోని బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన బన్నీ.. చిత్రోత్సవంలో పుష్ప సినిమాను ప్రదర్శించబోతున్న విషయాన్ని స్పష్టం చేశాడు. విదేశీ ప్రేక్షకులు పుష్ప సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందని, భారతీయ సినిమాను వాళ్లు ఏ కోణంలో చూస్తారో తెలుసుకోవాలని ఉందని, అందుకే ఫిలిం ఫెస్టివల్ కు వచ్చానంటున్నాడు.
ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్ప (అల్లు అర్జున్), పోలీసాఫీసర్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) మధ్య పోరు మొదలయ్యే దగ్గర పుష్ప పార్ట్-1కు శుభం కార్డు పడుతుంది. పార్ట్-2లో ఆ రెండు పాత్రల మధ్య ఘర్షణ చాలా పెద్ద స్థాయికి చేరుకుంటుందని అంటున్నాడు బన్నీ.
పుష్ప-2 ది రూల్.. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.