కొణిదెల నాగబాబు కన్ను అనకాపల్లి మీద పడింది. నరసాపురం వదిలేసి తిన్నగా అనకాపల్లి వచ్చారు. కాపులు చెప్పుకోతగ్గ సంఖ్యలో వున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడకు పరుగెత్తుకు వచ్చారు.
ప్రజారాజ్యం టైమ్‌లో అల్లు అరవింద్ కూడా అలాగే వచ్చారు. అనకాపల్లి ఓటర్లు పరాభవించి వెనక్కు పంపారు. ఇద్దరు వెలమలు, ఒక కాపు పోటీ చేసినా కూడా అక్కడ కాపు అభ్యర్థిగా అల్లు అరవింద్ గెలవలేకపోయారు. ఈసారి ఎంపీగా నాగబాబు పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు. కానీ బయటకు చెప్పలేదు. అలా అని దాచలేదు. ఇక్కడే తిష్టవేసి తిరుగుతున్నారు. పైగా జోక్ ఏమిటంటే అనకాపల్లి కేంద్రంగా ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకుంటారట. వినేవాళ్లు వుంటే ఏమైనా చెబుతారేమో?
ఇక్కడ ఎంపీగా తనకు అవకాశం వుంటుందని అనుకున్నారు కొణతాల రామకృష్ణ. ఇప్పుడు నాగబాబు ఆయనను బుజ్జగిస్తూ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటున్నారని తెలుస్తోంది. కానీ అనకాపాల్లి ఎంపీ, ఎమ్మెల్యే రెండూ జనసేనకు తెలుగుదేశం వదిలేస్తుందా? తెలుగుదేశం తరపున మాజీ ఎమ్మెల్యే పీలా, అలాగే ఇటీవలే వైకాపా నుంచి వచ్చిన దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఎంపీ టికెట్ తన కొడుకుకు కావాలన్న అయ్యన్న పాత్రుడి కోరిక నెరవేరడం లేదు.
వైకాపా తరపున ఎవరు పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు. నాగబాబు పోటీకి దిగితే వైకాపా కచ్చితంగా బిసి అయిన గవర్లకు చాన్స్ ఇచ్చే అవకాశం వుంది. అదే జరిగితే నాగబాబుకు ఎదురీతే. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను ఇప్పటికే వైకాపా కాపులకు ఇచ్చేసింది. అందువల్ల ఎంపీ టికెట్ ను గవర్లకే ఇచ్చే చాన్స్ ఎక్కువగా వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం నాగబాబు ఇక్కడే తిష్ట వేసారు. అనవసరం అద్దె ఇల్లు తీసుకోవడం ఎందుకని, జనసేన టికెట్ ను ఆశిస్తున్న సుందరపు విజయకుమార్ కు అచ్యుతాపురంలో వున్న ఇంట్లో నాగబాబు హ్యాపీగా సెటిల్ అయినట్లు తెలుస్తోంది.
ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ ఫుడ్, నియోజకవర్గంలో పర్యటన ప్రస్తుతానికి నాగబాబు డైలీ రొటీన్ ఇది అని జనసేన కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీని గత పదేళ్లుగా నమ్ముకున్న వారిని పట్టించుకోకుండా ఎవరెవరో పార్టీలోకి వచ్చి హ్యాపీగా సెటిల్ అవుతున్నారని వారిలో వారు చెప్పుకుని బాధపడుతున్నారు.