పెళ్లికాని ప్రసాదు బాధ

తనను ఎలా చూడాలనుకుంటున్నారో అన్నది వదిలేసాడు అల్లరి నరేష్. మరీ మొహం మొత్తుతోంది అనుకుని, వేరే వేరే ట్రయ్ చేస్తూ వస్తున్నాడు. కానీ బాగుంది అనే దానికి హిట్ కు మధ్య ఊగిసలాడుతున్నాయి సినిమాలు.…

తనను ఎలా చూడాలనుకుంటున్నారో అన్నది వదిలేసాడు అల్లరి నరేష్. మరీ మొహం మొత్తుతోంది అనుకుని, వేరే వేరే ట్రయ్ చేస్తూ వస్తున్నాడు. కానీ బాగుంది అనే దానికి హిట్ కు మధ్య ఊగిసలాడుతున్నాయి సినిమాలు.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా గ్లింప్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు అల్లరి నరేష్. ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ఆ ఒక్కటీ అడక్కు అనే టైటిల్ ను తీసుకుని సినిమా చేస్తున్నాడు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు ఫస్ట్ నైట్ సమస్య అయితే, ఈ సినిమాలో అల్లరి నరేష్ కు పెళ్లి సమస్య.

గ్రూప్ హౌస్, వివిధ భాషల ఇరుగు పొరుగు జనాలు, సదా వాళ్లు అడిగే ప్రశ్న ఒక్కటే..పెళ్లెప్పుడు? చేతిలో పాన్ పట్టుకోవడం, పాన్ ఇండియా సినిమానా అని వెన్నెల కిషోర్ ప్రశ్నించడం ఇవన్నీ ఇవివి మార్క్ సెటైర్లను గుర్తుకు తెచ్చాయి. మొత్తం మీద గ్లింప్స్ అయితే బాగుంది. సినిమా ఇలాగే సాగితే అల్లరి నరేష్ మళ్లీ మంచి ఫన్ సినిమాను అందించే అవకాశం వుంది.

అవుట్ అండ్ అవుట్ హెల్దీ కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయింది. హెల్దీ ఫ్యామిలీ కామెడీ సినిమా వస్తే జనం ఆదరిస్తున్నారు. అందువల్ల అల్లరి నరేష్ ‘ ఆ ఒక్కటీ అడక్కు ‘ సినిమా ఆ రేంజ్ కు చేరుకుంటుందని ఆశిద్దాం. ఈ సినిమాను అలనాటి నటుడు సిఎస్ఆర్ కుటుంబ సభ్యులు చిలుక ప్రొడక్షన్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. ఫరియా కథానాయిక. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. మల్లి అంకం దర్శకుడు.