కల్కి లీకులు.. నోటీసులతో ఏంటి ఉపయోగం?

కొన్ని రోజుల కిందటి సంగతి.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్-వరల్డ్ సినిమా కల్కి నుంచి వరుసగా లీకులు. దీంతో ఆ మూవీ నిర్మాత అశ్వనీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్ కంపెనీకి లీగల్ నోటీసు…

కొన్ని రోజుల కిందటి సంగతి.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్-వరల్డ్ సినిమా కల్కి నుంచి వరుసగా లీకులు. దీంతో ఆ మూవీ నిర్మాత అశ్వనీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్ కంపెనీకి లీగల్ నోటీసు ఇవ్వడంతో పాటు.. లీకులకు పాల్పడిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చారు. 

ఇది జరిగి కొన్ని నెలలు మాత్రమే అయింది. అంతలోనే కల్కి సినిమా మరోసారి లీకుల బారిన పడింది. ఈసారి ఏకంగా సినిమా నుంచి ఓ యాక్షన్ సీక్వెన్స్ లీక్ కావడం బాధాకరం. ఇటువైపు ప్రభాస్ వర్గం ఓ రకమైన దుస్తులు ధరించి ఉంది, అటువైపు శత్రువర్గం మరో రకమైన దుస్తులు ధరించి ఉంది. రెండు వర్గాల చేతుల్లో అత్యాధునిక ఆయుధాలున్నాయి. 

రెండు వర్గాలు అరివీర భయంకరంగా యుద్ధం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఈసారి ప్రభాస్ తో పాటు, దీపిక పదుకోన్ కూడా ఈ యాక్షన్ సన్నివేశాల్లో ఉంది. 

వెంటనే అప్రమత్తమైన యూనిట్ వీడియోను వైరల్ కాకుండా అడ్డుకున్నప్పటికీ, దానికి సంబంధించిన స్టిల్స్ మాత్రం ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఈనెల 18 నుంచి ప్రభాస్ మరోసారి కల్కి సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు. దాదాపు వారం రోజుల పాటు మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీని తర్వాత రాజా సాబ్ కు కాల్షీట్లు ఇచ్చాడు ప్రభాస్.