తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగేలా బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి పొత్తుపై కామెంట్ చేశారు. ఏపీలో మరెవరినో సీఎం చేయడానికి తమ భుజాలపై మోసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఏపీలో తమ పార్టీ నాయకుడే సీఎం కావాలని ఆయన అన్నారు. మరెవరినో భుజాలపై ఎక్కించుకుని ముఖ్యమంత్రి చేసే పని తమది కాదని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ కామెంట్ చేశారు. ఇంకో పార్టీ నాయకుడిని సీఎం చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో తాము అధికారం చెలాయిస్తున్నామని, రాష్ట్రంలో కూడా రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే టీడీపీ బలం గురించి కూడా ఆయన పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న నువ్వ బలమైన వ్యక్తివే కావచ్చు, ఈ రోజు పరిస్థితి ఏంటని ఆయన చంద్రబాబును ప్రశ్నించడం గమనార్హం. 2014తో పోల్చితే 2019, 2024 పరిస్థితులు వేరన్నారు. ఈ రోజు ఎవరు ఎవరి అపాయింట్‌మెంట్ కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలో ఎవరి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారని ఆయన నిలదీశారు. ఎవరి పొత్తు ఎవరు కోరుకుంటున్నారని ఆయన పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో అధికారంలోకి వచ్చే శక్తి బీజేపీకి లేదని భావిస్తుంటే, తమ పొత్తు ఎందుకు కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా అమిత్‌షాను చంద్రబాబు కలిశారని ఆయన అన్నారు. కలిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో చంద్రబాబునాయుడు, తమ నాయకుడు అమిత్‌షా చెప్పలేదన్నారు.
ఈ స్థాయిలో ఇటీవల టీడీపీని ప్రశ్నలతో ముంచెత్తిన బీజేపీ నాయకులు లేరు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ అనుకూల వైఖరితో నడుచుకుంటున్న సంగతి తెలిసిందే. బీజేపీని చులకన చేసేలా సొంత పార్టీ నాయకులే వ్యవహరిస్తున్న పరిస్థితిలో, టీడీపీకి అంత సీన్ లేదన్నట్టు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడ్డం టీడీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు. టీడీపీకి విష్ణు సంధించిన ప్రశ్నలు బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేలా ఉన్నాయి.