ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ముందుగా అభ్యర్థులను మార్చాలని భావించిన నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించారు. ఆ మేరకు సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. దాదాపు 70 చోట్ల అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.
వైసీపీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదంటే, అక్కడ సిటింగ్ ప్రజా ప్రతినిధులే కొనసాగుతారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే మార్పుచేర్పులుండే అవకాశం వుంది. చాలా వరకూ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఉదాహరణకు సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేతో పాటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తాను కూడా రాచమల్లుతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రొద్దుటూరు నుంచే అధికారికంగా ప్రారంభించినట్టు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఇలా వైసీపీ కొత్త, పాత అభ్యర్థులు జనంలోకి వెళ్లి వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, మరోసారి వైసీపీని ఆదరించాలని కోరుతున్నారు.
తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతిలో భూమన అభినయ్, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితర నేతలు వైసీపీ ప్రచారాన్ని ఓ రేంజ్‌లో తీసుకెళుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు అభ్యర్థులెవరో తేల్చుకోలేకపోతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు వుంటుందని మొదట అనుకున్నారు.
ఇప్పుడు వాటి మధ్యలోకి బీజేపీ వచ్చింది. దీంతో సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. టీడీపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత కొరవడింది. మరోవైపు ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం టీడీపీ పోటీ చేసే సీట్లపై పెద్దపెద్ద లెక్కలు చెబుతోంది. చివరికి ఏమవుతుందో తెలియని అమోమయ పరిస్థితి.