కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల‌ను ఐటీ శాఖ స్తంభింప‌జేసి చావు దెబ్బ కొట్టింది. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ యువ‌జ‌న…

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల‌ను ఐటీ శాఖ స్తంభింప‌జేసి చావు దెబ్బ కొట్టింది. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ యువ‌జ‌న విభాగం ఖాతాలను కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. ఈ చ‌ర్య‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది.

త‌మ పార్టీకి సంబంధించి బ్యాంక్ ఖాతాల‌ను ఆదాయ ప‌న్నుశాఖ స్తంభింప‌జేయ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డమే అని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజ‌య్ మాకెన్ అభివ‌ర్ణించారు. మీడియాతో అజ‌య్ మాకెన్ మాట్లాడుతూ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 అకౌంట్లను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ రూ.201 కోట్లు ఆదాయ ప‌న్నుశాఖ‌కు చెల్లించాల్సి వుంద‌ని సద‌రు అధికారులు తెలిపారు.
 
2018-19 లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా, నోటీసులకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నుంచి స్పంద‌న లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో అకౌంట్లు సీజ్ చేస్తున్నట్టు ఐటీశాఖ  కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలకు సమాచారం ఇచ్చింది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డానికి రెండు వారాల ముందు ఐటీ శాఖ వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ర‌జాస్వామికంగా వుంద‌ని ఆ పార్టీ ప్ర‌తినిధి మండిప‌డ్డారు. బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బును సైతం సీజ్ చేసిన‌ట్టు ఆ పార్టీ కోశాదికారి అజ‌య్ మాకెన్ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని ఆయ‌న వాపోయారు.