చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటి నుంచి నోరు తెరవడం లేదు. బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అమిత్‌షాతో ఏం చర్చించారనే వివరాలు వెల్లడి కాలేదు. జనసేన, బీజేపీ ముందు నుంచి మిత్రపక్షాలు. ఆ తర్వాత టీడీపీతో కూడా జనసేన జత కట్టిన సంగతి తెలిసిందే.
బీజేపీ, జనసేన సీట్లపై రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. అయితే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును అమిత్‌షా సీట్ల విషయమై గట్టిగా డిమాండ్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నట్టు 26 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలను బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అమిత్‌షా ప్రతిపాదన చేశారు. ఇంతకు మించి తక్కువైతే తమకు పొత్తు అవసరం లేదని కూడా తేల్చి చెప్పినట్టు బీజేపీ నేతలు తెలిపారు.
ఈ మేరకు ఏఏ స్థానాలు కావాలో కూడా చంద్రబాబుకు ఓ జాబితాను అమిత్‌షా అందజేసినట్టు సమాచారం. రాయలసీమలో ధర్మవరం, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, మదనపల్లె, రాజమండ్రి సిటీ, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, ఏలూరు, శ్రీకాళహస్తి తదితర అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఇవి కేవలం బీజేపీ కోరుకుంటున్న సీట్లు. జనసేన అడుగుతున్న సీట్ల సంఖ్య వేరే వుంది.
మహా అయితే ఐదారు సీట్లు బీజేపీ తగ్గించుకోవచ్చు. 20కి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తగ్గే ప్రశ్నే లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేనతో పొత్తు వల్ల తమకెక్కడ సీట్లు దక్కవో అని టీడీపీ నేతలు భయపడుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు అంశం తెరపైకి రావడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 50 అసెంబ్లీ, 10 లోక్‌సభ సీట్లు పోతే, ఇక తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న టీడీపీకి నిద్ర కరవు చేస్తోంది.