మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కోచ్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వేటు వేసింది. చాలా కాలంగా కోచ్ జైసింహ అసభ్య ప్రవర్తనతో మహిళా క్రికెటర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే, తమను క్రికెట్ ఆడే అవకాశాలు రావని భయంతో అంతా మౌనంగానే భరిస్తూ వచ్చారు. ఇటీవల అతని వెకిలి చేష్టలు శ్రుతిమించడం, బాధితులు, వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో హెచ్‌సీఏ దిగి వచ్చింది.
కోచ్ జైసింహాను సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల మానప్రాణాలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మహిళా క్రికెటర్లను ఇబ్బందులకు గురి చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన అన్నారు.
తమపై కోచ్ వేధింపుల గురించి గత నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు మహిళా క్రికెటర్లు లేఖ రాశారు. కోచ్‌కు పలువురు అండగా నిలిచారని అందులో పేర్కొన్నారు. కోచ్ వేధింపుల నుంచి తమకు రక్షణ కావాలని ఆ లేఖలో వేడుకున్నారు. బీసీసీఐకి కూడా మహిళా క్రికెటర్లు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం గమనార్హం. మద్యం సేవించి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. అతని దుష్ప్రవర్తనపై ఎవరైనా ప్రశ్నిస్తే టీమ్ నుంచి తీసేస్తానని బెదిరించే వాడని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారు.
అయినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో తననెవరూ ఏమీ చేసుకోలేరని లెక్కలేనితనం అతనిలో కనిపించింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతుండగా మరోసారి మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులోనే మద్యం సేవిస్తుండగా, వారించిన క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఈ విషయమై హెచ్‌సీఏకు ఫిర్యాదు అందడంతో ఎట్టకేలకు వేటు వేశారు. జైసింహపై జీవిత కాలం నిషేధం విధిస్తామని హెచ్‌సీఏ ప్రకటించడం గమనార్హం.