తెలుగుదేశం అధినేత మనుషులుగా పేరు పొందిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు నియోజకవర్గాలను మినహాయిస్తే.. ఎక్కడైతే తమకు సానుకూలత లేదో సరిగ్గా అవే నియోజకవర్గాలనే ఏరికోరి కమలం పార్టీ పోటీకి ఇస్తున్నట్టున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు! పొత్తు పేరుతో బీజేపీతో మరోసారి చేతులు కలిపిన చంద్రబాబు.. పోటీకి మాత్రం అంతా తాలుసరుకును ఎంపిక చేసి బీజేపీ కి అంటగడుతున్నారు!
ఇది ఎవరో అంటున్న మాట కాదు.. భారతీయ జనతా పార్టీలోని పాత కాపులు ఇప్పటికే ఈ అంశంలో తమ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట! తాము కోరిన సీట్లను కాకుండా చంద్రబాబు తోచిన సీట్లలో బీజేపీని పోటీ చేయమంటున్నారనేది కమలం పార్టీ లోని పాత కాపుల ఫిర్యాదు. ఎలాగూ కమలం పార్టీలోని చంద్రబాబు మనుషులకు ఇలాంటి విషయాల్లో అభ్యంతరాలు లేవు. అయితే పాతవాళ్లు మాత్రం గయ్యిమంటున్నారు! బాహాటంగా మాట్లాడితే అధిష్టానానికి ఎక్కడ కోపం వస్తుందో అని వారు ఫిర్యాదులు చేస్తున్నట్టుగా భోగట్టా!
విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్ట్ లో పోటీ చేయమంటున్నారట బీజేపీని చంద్రబాబు నాయుడు. కదిరి నుంచి బీజేపీ సీనియర్ నేత విష్ణు ఆశలు పెట్టుకుంటే అక్కడ చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు! శ్రీకాళహస్తి నుంచి కూడా కమలం ఆశలుంటే అక్కడా టీడీపీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. రాజమండ్రిని ఆశిస్తే అనపర్తిని తీసుకోమంటున్నారట! ఇలా పది సీట్లను పేరుకు కేటాయించినా.. బీజేపీ కోరుకున్న సీటు తమకు విజయంపై ఆశలున్న సీటు ఒక్కటీ లేదనేది పాత వారు వాపోతున్నారు!
ధర్మవరం, జమ్మలమడుగులో కూడా కమలం పార్టీ గుర్తుకు ఏవో ఓట్లు గంపగుత్తగా పడతాయని కాదు, కేవలం అక్కడ బీజేపీ తరఫున బరిలోకి దిగేది చంద్రబాబు కు అత్యంత ఆప్తులు కాబట్టి.. ఆ సీట్లలో అయినా బీజేపీకి ఇచ్చినట్టుగా ఉన్నారు. వారు పేరుకే బీజేపీ! అంతకు మించి వారికి కమలం పార్టీతో ఉన్న అనుబంధం ఎంతో ఎవరికీ తెలియనిది కాదు! తెలుగుదేశం ఓడిపోగానే రాత్రికి రాత్రి బీజేపీలో చేరిన శరణార్థులు.
కదిరిలో విష్ణుకు మంచి అవకాశాలుంటాయి. ఆయన బంధుగణం ఉంది, బీజేపీకి నేపథ్యం ఉంది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ సపోర్ట్ చేస్తే కదిరిలో విష్ణు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. రెడ్ల ఓట్లు కూడా పడొచ్చు! అయితే బీజేపీ తరఫున విష్ణుకు చంద్రబాబు అలాంటి పోటీ అవకాశం అయినా ఇస్తాడనుకోవడం భ్రమ! వస్తే బీజేపీ ఓట్లు ఏవైనా కావాలి కానీ, ఆ పార్టీ తరఫున నిలబడతారనే నేతలకు చంద్రబాబు మార్కు పొత్తుల్లో ఛాన్సులుండవు.
వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్.. ఇలాంటి వారికి తప్ప బీజేపీ తరఫున పోటీ చేసే ఏ ఒక్కరికీ టీడీపీ సహకారం ఉండనేది చిన్నపిల్లాడికి కూడా తేలికగా అర్థమయ్యే విషయమే! పోటీకి అవకాశం ఇచ్చి వెన్నుపోటు వేయడం గతంలోని పని. అయితే ఈ సారి పక్కగా ఓడిపోయే సీట్లనే కమలానికి వదిలి అదే పొత్తు అనుకోమంటున్నారు చంద్రబాబు!