చిత్ర‌విచిత్రం.. అభ్య‌ర్థుల క‌రువులో టీడీపీ కూట‌మి!

మూడు పార్టీల పొత్తు అయిన‌ప్ప‌టికీ అభ్య‌ర్థుల కోసం ఇంకా వెదుకులాట‌! అవ‌స‌రం అయిన చోట ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకీ అభ్య‌ర్థుల‌ను చేర్చేసుకుంటున్నారు! అయినా.. ఈ…

మూడు పార్టీల పొత్తు అయిన‌ప్ప‌టికీ అభ్య‌ర్థుల కోసం ఇంకా వెదుకులాట‌! అవ‌స‌రం అయిన చోట ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకీ అభ్య‌ర్థుల‌ను చేర్చేసుకుంటున్నారు! అయినా.. ఈ కూట‌మికి ఇంకా అభ్య‌ర్థుల క‌రువు ఉదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఒక పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేయాలో క్లారిటీ లేదంటే, లేదా అభ్య‌ర్థి దొర‌క‌డం లేదంటే అదో క‌థ‌! అయితే మూడు పార్టీలు క‌లిపి పోటీ చేస్తూ ఉన్నాయి. బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ నేత‌లు వెళ్లి పోటీకి దిగుతున్నారు, జ‌న‌సేన‌కు తెలుగుదేశమే నేత‌ల‌ను సప్లై చేస్తోంది, అయిన‌ప్ప‌టికీ ఇంకా స‌ప్లై చేసుకోవ‌డానికి అవ‌కాశం లేక అభ్య‌ర్థుల కోస‌మే అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాలున్నాయంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు!

ఈ పొత్తులో భాగంగా బీజేపీకి అర‌కు ఎంపీ సీటులో పోటీకి చంద్ర‌బాబు త్యాగం చేశారు! అయితే అర‌కులో ఇప్పుడు బీజేపీకి అభ్య‌ర్థి లేరు! ఎవ‌రిని పోటీ చేయించాలో దిక్కుతోచ‌ని స్థితి ఏర్ప‌డిన‌ట్టుగా ఉంది. చేసేది లేక కొత్త‌ప‌ల్లి గీత‌ను పోటీ చేయించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంద‌ట క‌మ‌లం పార్టీ! 

ఆమె ఇప్ప‌టికే చాలా పార్టీలు మారారు, సొంత పార్టీని పెట్టుకుని గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి లోక్ స‌భ‌కు పోటీ చేస్తే వ‌చ్చిన ఓట్లు 1900 చిల్ల‌ర‌! అర శాతం స్థాయిలో ఓట్ల‌ను పొందిన ఆ పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకుని.. దాని అధినేత‌కు అర‌కు ఎంపీ టికెట్ కేటాయిస్తార‌ట‌! 

ఉన్న‌ది 25 ఎంపీ సీట్లు, అందులో పోటీకి మూడు పార్టీల వాటా, అవ‌స‌రం మేర‌కు అభ్య‌ర్థుల‌ను అటూ ఇటూ పంపుతూనే ఉన్నారు! అయినా.. ఇంకా కొర‌త ఉంది. ఇది కేవ‌లం అర‌కుకు ప‌రిమితం కావ‌డం లేదు, బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా బీజేపీ పోటీ చేయాలంటూ చంద్ర‌బాబు అంట‌గ‌ట్టిన‌ట్టుగా ఉన్నారు! అక్క‌డ కూడా బీజేపీకి అభ్య‌ర్థి విష‌యంలో క‌ష్టాలున్నాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు! ఆ సీట్లో ఇప్పుడు పోటీ చేసి క‌మ‌లం పార్టీ ఏం సాధించాల‌నుకుని ఒప్పుకుందో ఎవ‌రికీ అర్థం కాదు!

ఎక్క‌డైతే బీజేపీకి చెప్పుకోదగిన అభ్య‌ర్థి, ఆ అభ్య‌ర్థి ద్వారా క‌లిసొచ్చే కుల‌బ‌లం, పార్టీకి గ‌త నేప‌థ్యం ఉందో.. అలాంటి సీట్ల‌లో ఆ పార్టీ పోటీకి చంద్ర‌బాబు స‌సేమేరా అంటున్న‌ట్టుగా ఉన్నారు. టీడీపీకే అవ‌కాశం లేక‌, అభ్య‌ర్థుల‌ను పెట్టుకోవ‌డం క‌ష్టం అయిన చోట క‌మ‌లం పార్టీని బ‌రిలోకి దించి.. వారి ప‌రువును తీసేందుకు చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా ఉన్నారు!