గాజువాకలో ఆల్ రెడీ మంత్రిగా ఉన్న గుడివాడ అమరనాధ్ పోటీ చేస్తున్నారు. గాజువాకలో గుడివాడను గెలిపిస్తే మంత్రిగా మరోసారి అవుతారని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితులు కాబట్టి గాజువాకను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
గుడివాడ కూడా పార్టీ మీటింగులో మాట్లాడుతూ తాను మంత్రిగా ఎమ్మెల్యేగా అనకాపల్లిని అభివృద్ధిని చేశానని, గాజువాకను అంతకంటే మరింతగా అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నారు.తనను గెలిపిస్తే గాజువాకకు మంత్రి పదవి వచ్చినట్లే అని అంటున్నారు.
గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ ని వైసీపీ అభ్యర్ధిగా తిప్పల నాగిరెడ్డి ఓడించారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే సామాజిక సమీకరణల వల్ల తప్పిపోయింది. ఈసారి గుడివాడ గెలిస్తే తొలి క్యాబినెట్ లోనే మంత్రిగా ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దీనితో అప్రమత్తం అయిన టీడీపీ కూడా ధీటైన ప్రచారం చేస్తోంది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు గెలిస్తే ఆయన కూడా మంత్రి అవుతారు అని చెబుతోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లాకు మంత్రి పదవి ఆఫర్ ఉందని అంటున్నారు. ఈసారి విశాఖ సిటీలో సీనియర్లు ఎవరూ టీడీపీ నుంచి పోటీ చేయడంలేదు అని అంటున్నారు. సామాజిక పరంగా చూసుకున్న పల్లాకు ఇది మంచి చాన్స్ గా చెబుతున్నారు.
అయితే ఈ రెండు ప్రచారాలూ జనంలోకి ఎంతవరకూ వెళ్తాయన్నది చూడాలని అంటున్నారు. రెండు పార్టీలలో ఒకరే గెలుస్తారు. ఎదో ఒక పార్టీకే అధికారం దక్కుతుంది. ప్రజలు ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే గెలిపించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన చింతలపూడి వెంకటరామయ్య ఆ తరువాత అధికార కాంగ్రెస్ లో చేరారు.
అలా గాజువాక అంటే అధికారంలో ఉన్న పార్టీ పక్షమే అని అంటున్నారు. గాజువాకలో ఎవరు గెలిస్తే వారి పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యాలు చెబుతున్నారు. ఇవి ఎంతవరకూ నిజం అవుతాయో చూడాలి.