తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తనకు టికెట్ దక్కకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. తన రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా వ్యవహరించిన చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లపై ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తనకు అన్యాయం చేసిందని భావిస్తున్న టీడీపీని సర్వనాశనం చేయాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. అలాగే తనను కాదని మరెవరికో టికెట్ ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని సుగుణమ్మ రెడీ అయ్యారు.
ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీకి విధేయురాలినంటూనే, మరోవైపు ధిక్కరణ స్వరాన్ని వినిపించడం చర్చనీయాంశమైంది. కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామంటూనే… స్థానికుడై వుండాలని, అది కూడా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయడం వెనుక.. సుగుణమ్మ కుట్ర దాగి వుందని రెండు పార్టీలు గ్రహించాయి.
ఇటు చంద్రబాబుపై ధిక్కరణ, అటు పవన్‌పై బ్లాక్‌మెయిల్‌కు దిగారనే చర్చకు తెరలేచింది. ఒకవైపు తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరును పవన్ ఖరారు చేశారు. జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారని చెబుతూనే, సుగుణమ్మ సన్నాయి నొక్కులు నొక్కడం విమర్శలకు దారి తీస్తోంది. ఇవాళ మీడియా సమావేశంలో ఆమె ఏం మాట్లాడారంటే…
పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించినట్టు చంద్రబాబునాయుడు చాలా బాధతో చెప్పారన్నారు. తిరుపతిని అభినయ్, కరుణాకరరెడ్డి పాలన నుంచి విముక్తి చేయాలనేది ఆశయమన్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వుందన్నారు. కానీ జనసేన టికెట్‌ను స్థానికులకు కాకుండా, ఐదేళ్లు ఎవరి వల్లైతే బాధపడ్డామో ఆ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి గెలిపించాలని చెబుతున్నారని సుగుణమ్మ పరోక్షంగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేశారు.
తిరుపతిలో స్థానికులైన వారికే ఇవ్వాలని, ఆ దిశగా పునరాలోచన చేయాలని ఆమె కోరారు. గెలిచే వారై వుండాలనే షరతు విధించడం గమనార్హం. ఒకవేళ తనకు జనసేన టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ఆమె అన్నారు. స్థానికులకే ఇవ్వాలని, అభ్యర్థిని మార్చాలని జనసేన నాయకులే కోరుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఎవరో అడిగారని టికెట్ ఇవ్వడమనేది సరైంది కాదని పవన్‌పై మండిపడ్డారు. జనసేన అభ్యర్థి కోసం పనిచేయాలని అధికారికంగా తమ పార్టీ నాయకులెవరూ చెప్పలేదని సుగుణమ్మ అనడం గమనార్హం.
సుగుణమ్మ చెప్పదలుచుకున్న విషయం ఏమంటే… తిరుపతిలో తాను తప్ప మరెవరూ గెలవలేరని. కూటమి అభ్యర్థి అంటే తాను తప్ప, మరో నాయకుడెవరూ లేరనేది ఆమె మాటల సారాంశం. కావున టీడీపీ లేదా జనసేన అయినా తనకే టికెట్ ఇవ్వాలనే దబాయింపునకు ఆమె దిగారు. ఫైనల్‌గా ఆమె… ఆరణి శ్రీనివాసులు స్థానికేతరుడు కావడంతో, ఆయన గెలుపునకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. కాదు, కూడదని పార్టీలు మొండిగా పోతే, మరేదైనా పార్టీలో చేరి పోటీ చేస్తామనే హెచ్చరికలను ఆమె బహిరంగంగానే పంపారు. సుగుణమ్మ ధిక్కరణను టీడీపీ ఉపేక్షిస్తుందా? అలాగే ఆమె బ్లాక్‌మెయిల్‌కు పవన్ భయపడతారా? అనేది చర్చనీయాంశమైంది.