వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆయన బస్సులో ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ఈ ప్రచారానికి మేమంతా సిద్ధం అనే పేరు పెట్టారు. ఈ మేరకు వైసీపీ నాయకులు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సంగతి తెలిసిందే. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 19 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికలకు ఇంకా 50 రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ, రోజులు శరవేగంగా వస్తున్నాయి. దీంతో రాజకీయ నాయకులకు ప్రతి నిమిషం విలువైందే. ఎన్నికల సమరానికి ఎలా సిద్ధం కావాలో జగన్‌కు బాగా తెలుసు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. ప్రచారంలో ఏం చెబుతారో అన్న ఉత్కంఠ నెలకుంది.
ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభించి, ఇడుపులపాయలో ముగించనున్నారు. మొత్తం 21 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించనున్నారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలను మినహాయించి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి రోజూ సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప్రచారంలో భాగంగా జగన్ ప్రజల మధ్యే గడపనున్నారు. ప్రచార యాత్రలో భాగంగా స్థానికంగా మేధావులు, ప్రజాసంఘాలు, కళాకారులు తదితరులతో జగన్ మాట్లాడనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. రానున్న రోజుల్లో మెరుగైన పాలన అందించేందుకు ఏం చేస్తే బాగుంటుందో ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. జగన్ ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ మంగళవారం వెలువడనుంది.