కడప బరి నుంచి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి భార్య సతీమణి సౌభాగ్యమ్మ తప్పుకున్నట్టేనా? అంటే.. ఔననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సొంత జిల్లా కడపలోనే కట్టడి చేయాలనే వ్యూహంతో వివేకా కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకుని, ఎన్నికల బరిలో దించాలని చంద్రబాబు యోచించారు. వివేకా కుటుంబ సభ్యులు కూడా టీడీపీలో చేరేందుకు ఉత్సాహం కనబరిచారు.
అయితే ఏమైందో తెలియదు కానీ, కొత్తగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కడప పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థిగా వీరశివారెడ్డి అయితే ఎలా వుంటుందంటూ IVRS సర్వేని టీడీపీ నిర్వహిస్తోంది. ఈ మేరకు కమలాపురం నియోజకవర్గ ఓటర్లకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కడపలో జగన్‌ను దీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబుకు బలమైన కోరిక వుంది. అయితే ఆ పార్టీకి సరైన నాయకులు దొరకడం లేదు.
కడప లోక్‌సభ నుంచి తానే పోటీ చేస్తానని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి చాలా కాలంగా చెబుతున్నారు. ఆయన భార్య మాధవీరెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. వివేకా కుటుంబ సభ్యులు టీడీపీలో చేరితే శ్రీనివాస్‌రెడ్డిని పక్కకు తప్పించాలని చంద్రబాబు భావించారు. ఆ కుటుంబం ముందుకు రాకపోవడంతో టీడీపీ ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తోంది. నిజానికి టీడీపీకి శ్రీనివాస్‌రెడ్డి కంటే కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి బలమైన అభ్యర్థి దొరకరు.
కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని అకస్మాత్తుగా తెరపైకి ఎందుకు తెచ్చారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వీరశివారెడ్డికి కమలాపురంలో కొంత మేరకు పట్టు వుంది. అంత మాత్రాన ఆయనేదో అద్భుతాలు చేస్తారనుకోవడం అత్యాశే. కడప ఎంపీగా టీడీపీ వైపు నుంచి ఎవరు పోటీ చేసినా, ఎంత తేడాతో ఓడిపోతారో తేల్చుకోవాల్సి వుంటుంది.