అసలే కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజానీకం ఆగ్రహంతో వుంది. ప్రధాని మోదీ అంటే ఏపీ పాలిట విలన్. ఏపీ విభజన హామీలేవీ నెరవేర్చలేదనే ఆగ్రహం మన రాష్ట్ర ప్రజానీకంలో బలంగా వుంది. మరీ ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో మోదీపై ఒక్కశాతం కూడా అభిమానం లేదు. ప్రధాని మోదీ అండతోనే తమ నాయకుడు చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు అనుమానించడంతో పాటు నమ్ముతున్నాయి. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం టీడీపీ శ్రేణులు పని చేశాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబునాయుడు తప్పు మీద తప్పు చేస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుని మొదటి తప్పు చేశారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని దిద్దుకోలేని దారుణ తప్పిదానికి పాల్పడ్డారనే అభిప్రాయం వుంది. తన రాజకీయ అవసరాలు, స్వార్థం కోసం బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారనే కోపం రాష్ట్ర ప్రజల్లో వుంది. ఈ నేపథ్యంలో వాస్తవాలను విస్మరించి, బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరగడం విమర్శలకు దారి తీస్తోంది.
చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోదీపై చంద్రబాబు ఆకాశమే హద్దుగా పొగడ్తల వర్షం కురిపించారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తూ… ఔను అయితే చప్పట్లు కొట్టాలని చంద్రబాబు పిలుపునకు జనం నుంచి కనీస స్పందన కూడా కరువైంది. మోదీపై బాబు పొగడ్తలు శ్రుతిమించడంతో కొద్దోగొప్పో మద్దతు ఇస్తున్న ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలతో పాటు తటస్థ ఓటర్లు కూడా టీడీపీకి దూరమయ్యే ప్రమాదం వుంది.
రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దకు ఇంతగా సాగిలపడాలా? అనే ప్రశ్న ఉత్పన్నం కావడంతో పాటు జనంలో అసహ్యం కలుగుతోంది. మోదీని ఆంధ్రాకు రప్పించింది పొగడ్తలు కురిపించడానికేనా? అనే అనుమానం లేకపోలేదు. మోదీ ప్రాపకం కోసం ఇంతగా దిగజారాలా? అని సొంత పార్టీ శ్రేణులు సైతం అంటున్న మాట.
మోదీని విశ్వగురువుగా అభివర్ణించడం బాబు పతనానికి పరాకాష్ట అని మండిపడుతున్నారు. గతంలో ఇదే మోదీపై చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. ఇప్పుడేమో ఇలా. బాబు విపరీత ధోరణి ఆయన్ను అభిమానించే వాళ్లలో సైతం విరక్తి కలిగించిందని చెప్పక తప్పదు.