ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరతం పడతారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నాయకులంతా నమ్మారు. అసలు ఏపీలో అర శాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి కూడా ఇదే కారణమని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తద్వారా ఇక జగన్ పని అయిపోయిందనే సంకేతాలను ఇవ్వాలనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వ్యూహం బెడిసి కొట్టింది.
సీఎం వైఎస్ జగన్, షర్మిల విషయంలో టీడీపీ-జనసేన అభిప్రాయానికి పూర్తి భిన్నమైన అభిప్రాయం బీజేపీది. ఈ విషయం ప్రజాగళం సభ సాక్షిగా బయటపడింది. చంద్రబాబునాయుడు ప్రసంగంలో జగన్‌కు ఓటు వేయవద్దని ఆయన చెల్లెళ్లు కూడా కోరారని గుర్తు చేశారు. అలాగే వైసీపీ రక్తంతో తడిసిందని ఆయన చెల్లెళ్లే అంటున్నారని చెప్పుకొచ్చారు. బాబు తర్వాత ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో షర్మిలకు సంబంధించి బాబు, పవన్‌లకు షాక్ తగిలింది.
“ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు. రెండూ ఒకటే. రెండు పార్టీలను ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏ కూటమికి పడకుండా ఇద్దరూ కుమ్మక్కయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటును కాంగ్రెస్‌కు మళ్లించాలని చూస్తున్నారు” అని ప్రధాని విమర్శించారు.
ప్రధాని కామెంట్స్‌తో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఖంగుతిన్నారు. షర్మిలను అడ్డు పెట్టుకుని జగన్‌తో మైండ్‌గేమ్ ఆడాలని చంద్రబాబు, పవన్ వ్యూహం రచించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం షర్మిల, జగన్ వేర్వేరు కాదని రాజకీయంగా బాంబు పేల్చారు. మోదీ కామెంట్స్‌తో షర్మిల ఒక్కసారిగా షాక్ తిన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల ఉన్నారంటేనే ఆమెకు రాజకీయంగా ఉనికి వుంటుంది. ఇప్పుడు మోదీ కామెంట్స్‌తో తన ఉనికి దెబ్బతింటుందని షర్మిల ఉలిక్కి పడ్డారు.
అందుకే షర్మిల వెంటనే స్పందించారు. తనను అనడం ఏంటని మోదీని ప్రశ్నించారు. జగనే మోదీ దత్తపుత్రుడంటూ విమర్శలకు దిగారు. మోదీ విమర్శలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ వెంటనే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జగన్ పత్రికలో “జగన్ పార్టీ, కాంగ్రెస్ ఒక్కటే” శీర్షికతో బ్యానర్ వార్తను ప్రచురించడం గమనార్హం. త ప్రచారంతో జగన్‌పై షర్మిల విమర్శలకు ఏ మాత్రం విలువ లేకుండా చేయడమే వైసీపీ ఎత్తుగడ.
ఇందుకు మోదీ కామెంట్స్ వైసీపీకి ఎంతో దోహదం చేసేలా ఉన్నాయి. ఒక్క దెబ్బతో రెండు పిట్టలన్నట్టు… ఇటు మోదీకి ప్రాధాన్యం ఇవ్వడం, అటు షర్మిల రాజకీయ ఉనికిని దెబ్బ తీయడం. ప్రధాని మోదీ పర్యటన అన్ని విధాలా వైసీపీకి అనుకూలించిందని చెప్పక తప్పదు.