ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ…కూటమిలో నిరాశ, నిస్పృహలను నింపింది. ఇదే సందర్భంలో వైసీపీలో జోష్‌ను రెట్టింపు చేయడం చర్చనీయాంశమైంది. సభ నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. అలాగే వైసీపీ సభలతో పోల్చితే, ప్రజాగళం సభకు చెప్పుకో తగిన స్థాయిలో జనం రాలేదు. మరీ ముఖ్యంగా కూటమి శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపడంలో ప్రధాని మోదీ, చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ పూర్తిగా విఫలమయ్యారు.
చిలకలూరిపేట సభ ఓ ప్లాప్ షో అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీలో అధికార పార్టీ వరుసగా నాలుగు సిద్ధం సభల్ని నిర్వహించింది. ఒక దానికి మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో ఎన్నికల సమరోత్సాహాన్ని నింపగా, కూటమి సభలు మాత్రం అందుకు విరుద్ధంగా నిరుత్సాహాన్ని నింపడం చర్చనీయాంశమైంది. కూటమి సభలు ఫెయిల్ కావడంతో వైసీపీలో మరింత జోష్ పెరుగుతోంది.
ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడంలో మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు, పవన్ బాగా వెనుకబడ్డారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతోంది. అసలు చిలకలూరిపేట సభ ఎందుకు పెట్టారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధాని మోదీ, అలాగే చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్లాంటి ముఖ్య నేతలంతా హాజరైన సభలో తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సి వుండింది.
కానీ ఈ సభలో అలాంటి వాతావరణం కొరవడింది. పవన్, చంద్రబాబునాయుడు మొక్కుబడి ప్రసంగాలతో సరిపెట్టారు. ఇక మోదీ ప్రసంగం సరేసరి. ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తికే ఆయన పరిమితం అయ్యారు. ఇంతకు మించి ఏపీ రాజకీయాలపై ఆయన పెద్దగా మాట్లాడలేదు. కూటమి అధికారంలోకి రావాలంటే… సభ నిర్వహించాల్సిన తీరు మాత్రం ఇది కాదు. కనీసం తమకు అధికారం ఎందుకు ఇవ్వాలో ముగ్గురు అగ్రనేతలు చెప్పుకోలేకపోయారు.
మరోవైపు జగన్ మాత్రం సిద్ధం సభల్లో తమ పార్టీ శ్రేణులకి చక్కటి దిశానిర్దేశం చేశారు. తన పాలనలో మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి చెప్పాలని శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. ఇంతకంటే ఏ పార్టీకైనా ఏం కావాలి? ఇదే పని కూటమి ఎందుకు చేయలేకపోతోందనేదే ప్రశ్న. ఏది ఏమైనా చిలకలూరిపేట సభ విఫలం కావడంతో అధికార పార్టీలో భవిష్యత్ తమదే అనే ధీమా పెంచింది.