ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫక్తు తమ పార్టీ వారికి మాత్రమే రాజకీయ లబ్ధి చేయడం ప్రారంభం అవుతుంది. తమ పార్టీ వారికే పదవులు, హోదాలు అన్నీ దక్కుతూ ఉంటాయి. అందుకు భిన్నంగా ఉదాహరణలు మనకు కనిపించవు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు అలా చేస్తోంది.
వారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ జనసమితికి చెందిన కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అందుకు గాను, నామమాత్రంగా బతుకున్న ఆ రాజకీయ పార్టీని కాంగ్రెసులో విలీనం కావాలని గానీ, కనీసం ఆ పార్టీకి కాంగ్రెసుతో పొత్తు ఉన్నట్టుగా ప్రకటించాలని గానీ.. రేవంత్ కోరలేదు. ఎన్నికల ముందు చిన్న అవగాహన చేసుకున్నారు గనుక.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా.. తెజస ఎన్నికల్లో పోటీచేయకుండా ఆపారు గనుక.. ఆయనకు పదవి కట్టబెట్టారు. ఆయనను అప్పట్లో తమ ఎన్నికల ప్రచారానికి కూడా వాడుకోకపోయినా ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇచ్చేశారు.
ఇప్పుడు తాజాగా రేవంత్ చెబుతున్న మాటలను బట్టి.. గత ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ పార్టీకి సారథ్యం వహించి.. పలుచోట్ల పార్టీని పోటీకి దించి.. గట్టిగా పనిచేసిన మాజీ సివిల్ సర్వీసెస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కూడా రేవంత్ మంచి ఆఫరే ఇచ్చారట.
నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. చట్టసభల్లోకి రావాలనే ఆయన కోరిక తీరలేదు. కాంగ్రెస్ కు కూడా ప్రత్యర్థి పార్టీ నాయకుడే. అలాంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ పదవిని ఆఫర్ చేయడం జరిగిందట. వంద రోజు లపాలన పూర్తయిన నేపథ్యంలో మీట్ ది ప్రెస్ నిర్వహించిన రేవంత్ ఈ సంగతి వెల్లడించారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఆఫర్ ను తిరస్కరించారుట. అదే ప్రవీణ్ కుమార్ వెళ్లి రేవంత్ ప్రత్యర్థి కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని ఎంపీ ఎన్నికల్లో తలపడాలని చూస్తున్నారు.
కోదండరాంతో ఏదో అవగాహన ఉన్నది .. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారని అనుకుందాం. మరి ప్రత్యర్థి పార్టీ ప్రవీణ్ కుమార్ కు కూడా రేవంత్ ఆఫర్ ఇవ్వడం ఆశ్చర్యకరం. ఇన్ని జరుగుతుండగా.. అదే కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్నికల్లో పోటీచేయకుండా త్యీగం చేసిన వైఎస్ షర్మిలకు ఏం ప్రత్యుపకారం చేశారు? ఆమె నెత్తిన ఏపీసీసీ చీఫ్ గా ముళ్లకిరీటం పెట్టి పంపారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో చాలాకాలం కష్టపడి రాజకీయాలు చేసినప్పటికీ.. పాపం షర్మిల ఏమీ దక్కించుకోలేకపోయాకరని.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఏపీకి పంపేయడంతో అక్కడ మళ్లీ జీరోనుంచి మొదలెట్టాల్సిన దుస్థితిలో ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.