వ్యూహమా? గతిలేనితనమా?

రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేయవచ్చు గాక! తమ పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా లక్ష్యంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గడపవచ్చు గాక! కానీ.. సరిగ్గా ఎన్నికల ముంగిట్లో..…

రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేయవచ్చు గాక! తమ పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా లక్ష్యంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గడపవచ్చు గాక! కానీ.. సరిగ్గా ఎన్నికల ముంగిట్లో.. సొంత పార్టీలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేక ఫిరాయిస్తున్న వారిని అక్కున చేర్చుకుని, వెంటనే నెత్తిన పెట్టుకుని, వారికి టికెట్లు కట్టబెట్టే సంస్కృతిని ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న వారు, జెండా మోస్తున్న వారు, ధనమాన ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి విలువలేదా? పక్క పార్టీలనుంచి జంపింగ్ చేసి వచ్చే వారే.. టికెట్లు దక్కించుకుని, తమ మీద సవారీచేస్తోంటే పార్టీనే నమ్ముకున్న, పార్టీకి వెన్నెముక వంటి వారి మనఃస్థితి ఎలా ఉంటుంది?

వారూ వీరూ అని కాదు! దాదాపు అన్ని పార్టీలదీ అదే పరిస్థితి. ఎందుకిలా చేస్తున్నారు.. ఆయా పార్టీల తీరుతెన్నులపైనే, దారితప్పుతున్న ఆలోచన సరళిగురించే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘వ్యూహమా? గతిలేనితనమా?’

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మన డప్పు మనం ఘనంగా కొట్టుకునే ఈ దేశంలో.. ఈ దేశంలో ప్రజాస్వామిక విలువల ఎంతగా అభాసుపాలవుతుంటాయో అర్థం చేసుకోవడానికి రాజకీయ నాయకులు పార్టీల ఫిరాయింపులు ఒక పెద్ద ఉదాహరణ. దేశపు స్థితిగతులను నిర్దేశించే శాసనాలను ఆమోదించే అత్యుత్తమ వ్యవస్థ పార్లమెంటులో రూపొందిన చట్టాలు కూడా ఎంతగా అపహాస్యం పాలవుతుంటాయో తెలుసుకోవడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఒక పెద్ద ఉదాహరణ.

బహుశా ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు ఆమోదం పొందినప్పుడు- ఈ దేశపు  ప్రజాస్వామ్యంలో అసలైన నైతిక విలువల ప్రతిష్ఠితమవుతాయని కనీసం కొందరైనా కలలు కని ఉంటారు. కానీ వారి కలలన్నీ చాలా తక్కువ కాలంలోనే చెల్లాచెదురైపోయి ఉంటాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే.. ఎంత యథేచ్ఛగా ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాం. అందరూ శాసనకర్తలే. దేశాన్ని ఉద్ధరించడం గురించి విలువల గురించి మాట్లాడేవాళ్లే. ఏ ఒక్కరికీ చట్టం మీద గౌరవం మాత్రం ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు కూడా టెక్నికల్ గా పదవికి రాజీనామా చేయకుంటే మా పార్టీలో చేర్చుకోం అన్నారు తప్ప.. వచ్చిన వారిని కండువా కప్పకుండా చేరదీసిన వైనం మనం గమనించాం.

అలాగని రాజకీయాల్లో నాయకులు పార్టీ మారడం తప్పేమీ కాదు. పార్టీలే తమ తమ భావజాలాలను మార్చేసుకుంటాయి. సందర్భానుసారంగా, అవసరానుసారంగా ఈ మార్పుచేర్పులు జరుగుతూ ఉంటాయి. పార్టీలు తాము పుట్టిన సిద్ధాంతబలిమికి కట్టుబడి ఉండేట్లయితే అవి కొత్తరూపు సంతరించుకోకుండా, ఆ సిద్ధాంతాలకు విరుద్ధమైన వారితో కలవకుండా, అలాంటివారిని కలుపుకోకుండా ఒక పద్ధతిని పాటిస్తాయి. కానీ.. పార్టీలు అధికార దాహపు పునాదుల మీద తప్ప, సిద్ధాంతబలం మీద పుట్టే రోజులు ఎప్పుడో పోయాయి. యథారాజా తథా ప్రజా అన్న నానుడి రాజకీయాల్లో ‘యథా పార్టీ తథా నేతా’ అన్నట్టుగా తయారైపోయింది. పార్టీలు ఎలాగైతే.. ఒక నిర్దిష్టత లేకుండా తమ రూపగుణ విశేషాలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాయో.. నాయకులు కూడా అదే విధంగా అధికారంమీది వ్యామోహంతో విచ్చలవిడిగా పార్టీలు మారిపోతున్నారు.

ఎవ్వరు అధికారంలోకి వస్తే వారి పంచన చేరి, ఆ అయిదేళ్ల పాటూ స్వలాభాన్ని చూసుకోవడం ఒక్కటే పరమార్థం. అయిదేళ్ల తర్వాత మళ్లీ పాతపార్టీ గెలిస్తే.. మళ్లీ నిస్సిగ్గుగా ఫిరాయించవచ్చు. కాదని, రావొద్దని అనగల నిజాయితీ సదరు పార్టీకి కూడా ఉండదు కాబట్టి. ఇలాంటి ఫిరాయింపుల్లో నాయకులను ప్రలోభపెట్టి చేర్చుకునే పార్టీలు, పార్టీలను ప్రలోభపెట్టి చేరిపోయే నాయకులు రెండు రకాలూ జరుగుతుంటాయి. ఎన్నికల తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. గెలిపించిన పార్టీని వదలివెళ్లే పోకడల్ని మాత్రమే మనం ఫిరాయింపు అంటున్నాం. మరి ఎన్నికలకు ముందు జరిగేవి కేవలం చేరికలే అనుకోవాలేమో.  ఈ చేరికలలో ఎంత నిజాయితీ ఉంది? ఎంత అవ్యవస్థ ఉంది? అదే ఇప్పుడు చర్చ!

గెంతు వేసేయ్.. టికెట్ కొట్టేయ్..

సరిగ్గా ఎన్నికల వేళ వచ్చే వరకు ఒక పార్టీలో కొనసాగుతూ ఉండడం.. వాతావరణంలో ఎన్నికల వేడి మొదలయ్యాక పార్టీ మారడం ఇప్పుడొక ఆధునిక ఫ్యాషన్ అయిపోయింది. వారి వారి అంచనాలను బట్టి, వారు కోరుకునే నియోజకవర్గాల్లో ఉండే స్థానిక సమీకరణలను బట్టి.. ఏ పార్టీ కాస్త బలంగా విజయావకాశాలతో కనిపిస్తే అటువైపు చేరిపోవడం చాలా రొటీన్ విషయంగా మారింది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. అప్పుడే పిల్లిమొగ్గ వేసి, గెంతు వేసి తమ జట్టులోకి వచ్చిన నాయకుడికి పార్టీలు టికెట్ కట్టబెట్టేస్తున్నాయి.

కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే మొదలెడదాం. కేశినేని నాని తో ఆ పార్టీకి ఉన్న భావసారూప్యత ఏమిటి?  కేవలం చంద్రబాబుతో విభేదించడం, చంద్రబాబును దూషించడం. పోనీ ఆ సారూప్యత వారి మధ్య ఏర్పడి ఎన్నాళ్లయింది. కొన్ని నెలల కిందటే కదా! చంద్రబాబు ఆయనను పక్కన పెట్టిన తర్వాత, ఆ పార్టీలో తనకు ఠికానా లేదని ఆయనకు అర్థమైన తర్వాత.. ఆయన జగన్ వైపు చూశారు. జగన్ వెంటనే ఆయనను తమ పార్టీలో చేర్చుకున్నారు. దాదాపుగా ఆయనకే విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు. చంద్రబాబునాయుడు విషయానికి వస్తే ఒకరా ఇద్దరా?  తెలుగుదేశం పార్టీ ఏపీలో 17 ఎంపీ సీట్లకు పోటీచేయబోతుండగా దాదాపు సగం మంది వరకు ఇప్పటికిప్పుడు ఇతర పార్టీలనుంచి వచ్చినవారే ఉండబోతున్నారు.

నరసరావు పేట లావు కృష్ణదేవరాయలు, కర్నూలు సంజీవ్ కుమార్, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి (లేదా కొడుకు రాఘవరెడ్డి), నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్యేల్లో కూడా పార్థసారధి, వసంత కృష్ణ ప్రసాద్, వేమిరెడ్ది ప్రశాంతిరెడ్ది, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  వంటి అనేకులున్నారు. మచ్చుకు జనసేన సంగతి కూడా చూద్దాం. ఆయన పరిస్థితి ఇంకా ఘోరం పదేళ్లనుంచి పార్టీని నడుపుతున్నా కూడా.. ఇప్పుడు ఎన్నికల సీజను రాగానే.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తన జట్టులో చేరుతారా? వారికి టికెట్ ఇచ్చేద్దామా? అని కాసుక్కూచున్నట్టుగా పవన్ వ్యవహారం ఉంది. జగన్ ఎమ్మెల్యేలను బదిలీచేస్తున్నారని ఎద్దేవా చేసిన ఈ నేత.. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును చేర్చుకుని తిరుపతికి బదిలీచేసి తన సొంత పార్టీలో ముసలం పెట్టుకున్నారు. వల్లభనేని బాలశౌరి, కొణతల రామకృష్ణ, వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్లు ఎందరో!

అసలు పవన్ విషయంలో ఇంకా దయనీయమైన సంగతి ఏంటంటే.. మొన్నటికి మొన్న పూర్తయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భాజపాతో పొత్తు పెట్టుకుని 8 సీట్లు పుచ్చుకున్నారు. అందులో నలుగురి వరకు అప్పటికప్పుడు పార్టీలో చేరినవాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారు. వారు వచ్చి పార్టీలో చేరకపోతే ఆయన పరిస్థితి ఏమిటి? ‘రండి బాబూ రండి’ అని బోర్డు పెట్టుకునే వారా?  ఇలా సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి చేరేవారికి అప్పటికప్పుడు టికెట్లు కట్టబెట్టేసే ధోరణి వలన పార్టీలకు వాటి అధినేతలకు టికెట్లు అమ్ముకుంటున్నారనే చెడ్డపేరు కూడా వస్తుంది.

ఈ ఉదాహరణలను గమనించినప్పుడు వారి చర్యలు వెనుక వ్యూహమో? గతిలేనితనమో? వుంటాయని అనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ది వ్యూహమే కావొచ్చు. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నేత అక్కడ ధిక్కరించి తమ పంచకు చేరడంలో కొన్ని సంకేతాలు జనంలోకి వెళ్లడం అవసరమని భావించి ఉండవచ్చు. అలాగే తెలుగుదేశం చేరికల్లో కూడా పాక్షికంగా వ్యూహమూ, పాక్షికంగా గతిలేనితనమూ ఉన్నాయని అనుకోవాలి. జనసేన విషయానికి వస్తే సంపూర్ణంగా గతిలేనితనమూ, దానికి అదనంగా టికెట్ల విక్రయ బేరమూ ఉన్నాయని అనిపిస్తుంది. పదేళ్లుగా పార్టీని నడుపుతున్న వ్యక్తి.. కేవలం 21 నియోజకవర్గాల్లో నిల్చోబెట్టడానికి సొంత అభ్యర్థులు లేని దుస్థితిలో ఉన్నారంటే ఆయన నాయకత్వ పటిమ ఏపాటిదో ప్రజలు అర్థం చేసుకోగలరు.

తెలంగాణ, లేదా జాతీయ వ్యవహారాల్లో కూడా పరిస్థితి భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. భారాసనుంచి, భాజపా నుంచి ఇప్పటికిప్పుడు వచ్చి చేరుతున్న జితేందర్ రెడ్డి లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఎగబడుతున్నది. భాజపా పరిస్థితి ఇంకా దయనీయం. రేపు అభ్యర్థులు మొత్తం లెక్కతేలితే.. తాజా వలసనేతలే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులుగా ఉన్నా ఆశ్చర్యంలేదు. జహీరాబాద్ పాటిల్ నుంచి శానంపూడి సైదిరెడ్డి వరకు వలసనేతల మీద ఆశలు పెంచుకునే వారు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా భాజపా వలసనేతల మీద పుష్కలంగా ఆధారపడుతోంది.

పార్టీ నిర్మాణం నాశనం కాదా?

ఇలా కొత్తగా వచ్చి చేరే వారికి అప్పటికప్పుడు టికెట్లు ఇచ్చేసి.. అప్పటిదాకా దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోస్తూ.. ఏదో ఒక నాటికి తమకు పదవులు దక్కుతాయని ఆశపడుతూ ఉండే కార్యకర్తల, నాయకుల నెత్తిన బలవంతంగా రుద్దే పోకడల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా దుర్మార్గమైన పోకడ. పార్టీ అవసరాలకోసం, ముందే చెప్పుకున్నట్టుగా వ్యూహాత్మకంగా ప్రత్యర్థిమీద పైచేయి సాధించడం కోసం ఒకటి రెండు కొత్త చేరికలు అవసరం అవుతూఉండవచ్చు గాక! కానీ వలసవచ్చే వారికోసమే నిరీక్షిస్తున్నట్టుగా.. వచ్చిన వెంటనే వాళ్ల నెత్తిన కిరీటాలు పెట్టడం, టికెట్లు కట్టబెట్టడం పార్టీ కార్యకర్తల కడుపు మండిస్తుంది.

ఇలాంటి పోకడల వలన కార్యకర్తల్లో పార్టీ పట్ల ఉండే అనుబంధం ఛిద్రమైపోతుంది. పార్టీ తమ గతిలేనితనం కొద్దీ.. కొత్త నాయకుల్ని తెచ్చి తమ మీద రుద్దితే వారు ఏం చేయగలరు? అప్పటికప్పుడు ఆ పార్టీని వదలి మరో పార్టీలోకి వెళ్లడానికి అందరికీ అవకాశం కుదరకపోవచ్చు. అదే పార్టీలో ఉంటారు. కొత్తగా వచ్చిన వలసనేత నుంచి తృణమో పణమో పుచ్చుకుని పనిచేస్తారు. నెమ్మదిగా రాజకీయం, పార్టీలలో కార్యకర్తగా పనిచేసే వ్యవహారం కూడా ఫక్తు వ్యాపారం అవుతోంది. ఎవ్వరికీ కూడా పార్టీ గురించి గానీ, ప్రజల గురించి గానీ, సమాజం గురించి గానీ కన్సర్న్ ఉండదు. పార్టీలు కొత్త వలసనేతలకు టికెట్లు అమ్ముకుంటూ పదులకోట్లు దండుకోవడానికి చూస్తుంటాయి. పార్టీ సంపాదన పార్టీదే.. మన సంపాదన మనదే అన్నట్టుగా కార్యకర్తలు, స్థానిక నాయకులు వారి స్థాయిని బట్టి లక్షలు, సింగిల్ డిజిట్ కోట్లూ దండుకోవడానికి బేరాలు ఆడుతూ ఉంటారు. మొత్తం వ్యవహారం అంతా వ్యాపారం తప్ప మరొక మాట ఉండనే ఉండదు. 

ఇలాంటి విశృంఖలత అనివార్యంగా రాజకీయ వ్యవస్థలోకి చొరబడిపోతే ఆ పాపం ఎవరిది?  పార్టీల అధినేతలే అందుకు బాధ్యత వహించాలి. క్లీన్ పాలిటిక్స్ అనేవి- గత వైభవానికి సంబంధించిన ఒక జ్ఞాపిక లాగా మన బుర్రలోని గాజుతలుపుల అల్మేరాల్లో భద్రంగా మిగిలిపోతాయి.

ఈ రొచ్చు లోనే, ధనావేశపూరితమైన రాజకీయ వ్యవస్థలోనే నిత్య ఆత్మవంచనతో అందరూ మనుగడ సాగిస్తూ ఉంటారు. ఏ ఒక్క పార్టీ పట్ల కూడా అంకితభావం, చిత్తశుద్ధి, నిబద్ధత వంటి ఆలోచనలు లేకుండా, అలాంటి పదాలను తమ తమ డిక్షనరీల్లోంచి చెరిపేస్తూ.. యథేచ్ఛగా, విచ్చలవిడిగా రాజకీయ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. తప్పదు మరి- ‘అశుభం భూయాత్’ అంటూ సర్దుకుపోవాల్సిందే.

.. ఎల్. విజయలక్ష్మి