నిమ్మల కిష్టప్ప.. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో బీసీ నాయకుడు! చేనేత సామాజికవర్గానికి చెందిన నిమ్మల చంద్రబాబు కేబినెట్ లో ఒకప్పుడు మంత్రి! తెలుగుదేశం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిమ్మలకు టికెట్ ఇచ్చేది!
చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేయడమే కాదు, హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నేపథ్యం కూడా ఉంది నిమ్మలకు! కట్ చేస్తే.. ఇప్పుడు నిమ్మలను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు తెలుగుదేశం పార్టీలో.
నిమ్మల గోరంట్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అయితే పునర్విభజనలో అది పెనుకొండలో కొంత, కొత్తగా ఏర్పడిన పుట్టపర్తిలో మరి కొంత కలిసింది. దీంతో నిమ్మలకు అటూ ఇటూ చోటు లేకుండా పోయింది. అయితే ఈయనకు 2014లో ఎంపీ టికెట్ ఇచ్చారు. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో నేసే వాళ్ల జనాభా కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటుంది. ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో వీరి జనాభా ఉంటుంది.
సేనే వాళ్లు సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటారు. బీసీల కోటాలో వీరు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచేవారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వీరికి రాజకీయ ప్రాధాన్యత మాత్రం శూన్య స్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో తను లేదా తన తనయుల్లో ఒకరు పుట్టపర్తి నుంచి పోటీ చేయాలని నిమ్మల కిష్టప్ప ఆశించారు. అయితే.. పల్లె రఘునాథరెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో నిమ్మల కథ ముగిసినట్టే అని అనుకోవాలి.
ఇప్పుడు నిమ్మల టికెట్ కోసం ఎంత రంకెలేసినా.. ఇక దక్కేదేమీ ఉండకపోవచ్చు! హిందూపురం ఎంపీ టికెట్ ను బీజేపీ తన్నుకుపోయేలా ఉంది. పెనుకొండకు ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించారు. పుట్టపర్తిని పల్లె కుటుంబం దక్కించుకుంది. దీంతో నిమ్మల కుటుంబ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే అనుకోవాలి. చంద్రబాబుతో తేల్చుకుంటానంటూ నిమ్మల ప్రకటిస్తున్నారట, అయితే ఇక తేల్చుకోవడానికి కూడా ఏమీ మిగలనట్టుగా ఉంది. చంద్రబాబు నాయకత్వంలో అనంతపురం జిల్లాలో ఇలా మరో బీసీ నేత తొక్కివేయబడినట్టే!