మోడీ ప్రసంగం..దిగాలుపడిన కూటమి

అంతన్నాడు..ఇంతన్నాడు.. గంగరాజు అన్నట్లు వుంది ప్రధాని మోడీ ప్రసంగం జనగళం సభలో. ఈ సభ మీద దేశం-జనసేన కూటమి భారీ ఆశలు పెట్టుకుంది. భారీగా జనాల్ని తరలించాలి. మోడీ వచ్చి జగన్ మీద నిప్పులు…

అంతన్నాడు..ఇంతన్నాడు.. గంగరాజు అన్నట్లు వుంది ప్రధాని మోడీ ప్రసంగం జనగళం సభలో. ఈ సభ మీద దేశం-జనసేన కూటమి భారీ ఆశలు పెట్టుకుంది. భారీగా జనాల్ని తరలించాలి. మోడీ వచ్చి జగన్ మీద నిప్పులు చెరుగుతారు. జగన్ పాలనను ఎండ గడతారు. ఇక దాన్ని ముక్కలు ముక్కలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు అనుకున్నారు ఎల్లో మిత్ర బృందం. కానీ ఆశలు నెరవేర లేదు సరికదా, అడియాసలయ్యాయి.

మామూలుగా అయితే మోడీ ప్రసంగాలు బాగానే వుంటాయి. తిట్లు లంకించుకోకపోయినా, పదునైన పదజాలమే వాడతారు. కానీ ఈసారి మోడీ ప్రసంగం మాత్రం ఫక్తు డాక్యుమెంటరీ సినిమా మాదిరిగా సాగింది. ఎప్పుడో 2014 తరువాత ఇచ్చిన విద్యాసంస్థలు వగైరా పాత విషయాలు ఏకరవు పెట్టుకుంటూ వచ్చారు తప్ప, రాజధాని, పోలవరం వంటి వాటిని ప్రస్తావించలేదు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అన్నారు తప్ప, జగన్ మీద నింద వేయలేదు.

చూస్తుంటే మోడీకి ఇంకా ఆంధ్ర ఎన్నికల పరిస్థితి మీద పూర్తిగా పట్టు చిక్కినట్లు లేదు. రేపు అవసరం పడితే మళ్లీ జగన్ ను సాయం కోరాల్సి వుంటే, ముందు జాగ్రత్త అవసరం అన్న భావనతో చాలా జాగ్రత్తగా ప్రసంగించినట్లు కనిపిస్తోంది. పైగా కాంగ్రెస్, వైకాపా రెండూ కుటుంబ పాలన అనడం మరీ చిత్రం. నిజానికి జగన్ తప్ప, ప్రభుత్వంలో అతని కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. కానీ తేదేపా మాత్రం అలా కాదు. బాబు, లోకేష్, పురంధ్రీళ్వరి, బాలకృష్ణ అంతా ఫ్యామిలీనే.

ఇదిలా వుంటే పవన్ ప్రసంగిస్తుంటే మోడీ వున్నట్లుండి కలుగ చేసుకుని, జనాలను లైట్ పోల్స్ మీద నుంచి దిగమని పదే పదే అనడం కాస్త ఆశ్చర్యం. నిజానికి మోడీకి కన్సర్న్ వుంటే పక్కన వున్న ఎవరికో ఒకరికి చెపితే సరిపోతుంది. ప్రధానిగా ఆయనే రంగంలోకి దిగక్కరలేదు. పవన్ ఓ పేద్ద డేటా రాసుకుని వచ్చి, ఆవేశంగా ప్రసంగిస్తుంటే ఏకంగా హ్యాండ్ బ్రేక్ వేసి ఆపేసినట్లు అయింది. పవన్ ప్రసంగంలో పసలేదు కానీ, తన స్టయిల్ లో రెచ్చిపోయి మాట్లాడాలని అనుకున్నారు. కానీ అది కాస్తా వీగిపోయింది.

చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం మోడీని పొగడడానికే సరిపోయింది. అది తెలుగుదేశం కేడర్ కే నచ్చడం లేదు. మోడీ చేసిన హానిని అంత సులువుగా మరిచిపోలేకపోతున్నారు. అధికారం అవసరం కోసం చంద్రబాబు చటుక్కున మాట మార్చ గలిగారు కానీ కేడర్ ఇంకా అసంతృప్తిగానే వున్నారు. అందుకే బాబు ప్రసంగం కూడా వృధానే అయింది.

మొత్తం మీద చాలా పెద్దగా ప్రభావం చూపుతుంది అనుకున్న జనగళం సభ వీగిపోవడం కాస్త విచారకరమే కూటమికి.