సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి నియోజకవర్గంలో అభ్యర్థిత్వాన్ని డిసైడ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ బోలెడు తర్జనభర్జనలు పడింది! ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే పల్లెపై పార్టీలో అసమ్మతి నెలకొని ఉంది. అలాగే ఎన్నికల సమయంలో మాత్రమే పల్లె జనాలను కూడా పట్టించుకుంటున్నారు తప్ప అంతకు మించి ప్రజలకు టచ్ లో ఉన్నది కూడా ఏమీ లేదు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంటపై తీవ్ర వ్యతిరేకత ఉంటే.. పల్లెకు లాభించాలి తప్ప, అంతకు మించిన సానుకూలత ఏమీ లేదు! అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు టికెట్ ఇస్తుందనే ప్రచారం కూడా కొన్నాళ్ల పాటు సాగింది. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ బీసీలకే టికెట్ ఇచ్చేది! అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ బీసీలకు స్థానం లేకుండా పోయింది.
ఇది గోరంట్ల నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడ్లకు టికెట్ ఇవ్వడం, టీడీపీ బీసీలకు ఇవ్వడం సంప్రదాయంగా ఉండేది. అయితే తెలుగుదేశం బీసీలకు ఇక్కడ తలుపులు మూసేసింది. మరి ధైర్యంగా పల్లెకు అయినా టికెట్ ఇచ్చారా? అంటే.. అదీ లేదు!
ఆయన కోడలికి టికెట్ ను ఖరారు చేశారట! ఎంతైనా దుద్దకుంట వర్సెస్ పల్లె పోటీ జరగడం వేరు, ఇప్పుడు పల్లె కోడలు తెరపైకి రావడంతో టీడీపీ శ్రేణులు నిశ్చేష్టులు అవుతున్నాయి. దూకుడైన రాజకీయం జరగాల్సిన చోట ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువతిని తీసుకొచ్చి నిలపడం అయితే అంత మెరుగైన వ్యూహంలా లేదు!
పల్లెకు వయసు మీద పడిందని తప్పించి కోడలికి ఛాన్సిచ్చినట్టుగా ఉన్నారు. అయితే ఆమె ప్రచారం మొదలుపెట్టగానే వడదెబ్బకు పడిపోయినట్టుంది. ఏనాడూ ఇళ్లు దాటని వారు ఇలా మార్చి ఎండల్లో ప్రచారానికే పడిపోతే.. పోలింగ్ జరిగేది మే నెలలో! ఎంత పల్లె వెనుకుండి రాజకీయం నడిపినా.. ఇక్కడేదో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ఉన్నారు!