అచ్యుతాపురంలో ఏం జరిగింది?

అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుగానే రంగంలోకి దిగిపోయారు మెగా బ్రదర్ నాగబాబు. కానీ వున్నట్లుండి వెనక్కు వచ్చేసారు. నిజానికి అంత పెద్ద గడబిడ ఏమీ జరగలేదు నాగబాబు అభ్యర్థిత్వం మీద. పైగా…

అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుగానే రంగంలోకి దిగిపోయారు మెగా బ్రదర్ నాగబాబు. కానీ వున్నట్లుండి వెనక్కు వచ్చేసారు. నిజానికి అంత పెద్ద గడబిడ ఏమీ జరగలేదు నాగబాబు అభ్యర్థిత్వం మీద. పైగా ఎమ్మెల్యే టికెట్ గవర కులానికి ఇచ్చారు. ఎంపీ టికెట్ కాపు కులానికి. అందువల్ల సమస్య ఏమీ లేదు.

పిఠాపురంలోనో, మరో చోటనో జరిగినంత గొడవలు, ఆఫీసు ముట్టడులు, జెండాలు కాల్చడం ఇలాంటివి ఏమీ జరగలేదు. పైగా నాగబాబు చాలా సాఫీగా నియోజకవర్గం జనాలతో కలిసిపోయి, తన గ్రౌండ్ ప్రిపరేషన్ తాను చేయడం మొదలుపెట్టారు కూడా.

పోనీ భాజపా అడిగింది, తేదేపా అడిగింది అని అనుకోవడానికి కూడా లేదు. అప్పటికి అలాంటి వార్తలు ఏమీ లేవు. మరి ఎందుకు నాగబాబు వెనక్కు వున్నట్లుండి వచ్చేసారు అంటే, ఓ గ్యాసిప్ విశాఖ జిల్లా జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటీ అంటే.. నాగబాబు ఇలా అచ్యుతాపురంలో మకాం వేసి, తన గ్రౌండ్ ప్రిపరేషన్ తాను చేసుకుంటూ వుంటే, ఆయనకు తోడుగా అక్కడ వున్న కొంతమంది లోకల్ లీడర్లు మరో విధమైన గ్రౌండ్ ప్రిపరేషన్ మొదలుపెట్టారని టాక్.

అచ్యుతాపురం అంటే ఫుల్ గా ఇండస్ట్రియల్ ఏరియా. ప్రతి ఒక్కళ్ల కన్ను అనకాపల్లి ఎంపీ సీటు మీద వుండడానికి కారణం అదే. విశాఖపట్నం పేరుకే కానీ సెజ్ లు, హెల్త్ సిటీ, ఇంకా అనేనకానేక పరిశ్రమలు అన్నీ వున్నవి అనకాపల్లి ఎంపీ పరిథిలోనే. సో, అలా నాగబాబు కు తెలియకుండానే కొందరు పారిశ్రామిక వేత్తలకు కబురు చేయడం, నాగబాబు పోటీ చేస్తారు. గెలిస్తే మంత్రి అవుతారు. అందువల్ల ఈ ఎన్నికకు ఎంత, ఏ విధంగా సహకరిస్తారు అంటూ మీటింగ్ లు మొదలుపెట్టారట ఆ అనుచరులు.

తెలుగుదేశంతో, అలాగే జనసేన పెద్దలతో పరిచయం వున్న కొందరు పారిశ్రామిక జనాలు ఈ విషయాన్ని అక్కడకు చేరవేసారట. దాంతో ఇది కానీ పెద్దది అయితే బ్యాడ్ నేమ్ వస్తుందని పవన్ ఆందోళన చెంది, నాగబాబును అర్జంట్ గా వెనక్కు పిలిపించారని తెలుస్తోంది. నిజానికి పవన్ గట్టిగా తలుచుకుంటే పిఠాపురం మాదిరి అనకాపల్లి దగ్గర కూడా అసంతృప్తి లేకుండా చంద్రబాబు సర్దుబాటు చేయగలరు. కానీ ఎందుకు అలా చేయలేదు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అదే టైమ్ లో ఇలాంటి గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.