అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తారు అని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో వైసీపీ అప్రమత్తం అయింది. అన్ని ఎంపీ సీట్లూ ప్రకటించిన అధినాయకత్వం అనకాపల్లి ఎంపీ సీటుని పెండింగులో పెట్టింది. దాంతో సీఎం రమేష్ పోటీ మీద వైసీపీ పెద్దలకు పూర్తి క్లారిటీ ఉంది అని అంటున్నారు.
పొత్తులో భాగంగా రమేష్ ని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన పోటీకి దిగితే ఓడించాలని వైసీపీ భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అవసరం అనుకుంటే మాడుగులలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దింపుతారు అని అంటున్నారు.
మాడుగులలో ఆయన కుమార్తె, జెడ్పీటీసీ మెంబర్ అయిన ఈర్లె అనూరాధకు టికెట్ ఇస్తారు అని అంటున్నారు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గవర సామాజిక వర్గానికి చెందిన నేత పేరు కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక మాజీ మంత్రికి సన్నిహితంగా ఉండేవారు, వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ వైపునకు వచ్చారు. ఆయనకు సీటు ఇవ్వడం ద్వారా రమేష్ ని ఓడించాలన్నది వైసీపీ మరో ఆలోచన.
వీరిద్దరితో పాటు మరిన్ని పేర్లను కూడా హై కమాండ్ సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తూంటే రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమై పోయింది అని అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగిన రమేష్ కి మైనస్ గా నాన్ లోకల్ ముద్ర ఉందని దాంతో ఆ కార్డుని వాడడంతో పాటు పక్కా లోకల్ క్యాండిడేట్ ని దించి ఆయన్ని ఓడించాలన్నది హై కమాండ్ వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు.