బొత్స జాక్ పాట్ కొట్టేశారా?

వైసీపీలో చాలా మంది మంత్రుల కంటే బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత అధినాయకత్వం దగ్గర ఎక్కువ అని అంటారు. అదే మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం విజయనగరం జిల్లాలో తన…

వైసీపీలో చాలా మంది మంత్రుల కంటే బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత అధినాయకత్వం దగ్గర ఎక్కువ అని అంటారు. అదే మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం విజయనగరం జిల్లాలో తన వారు తన బంధువులు సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకున్న బొత్స 2024లో కూడా జిల్లాలో ఏ ఒక్క సీటు పోకుండా చూసుకున్నారు.

సిట్టింగు ఎమ్మెల్యేల విషయంలో మార్పు చేర్పులు అన్నవి శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల జరిగాయి తప్ప విజయనగరంలో అసలు ఎక్కడా లేవు అంటే బొత్స పట్టు అలా ఉందని అంటున్నారు. చీపురుపల్లిలో బొత్స పోటీ చేస్తూండగా ఆయన తమ్ముడు బొత్స అప్పలనరసయ్యకు గజపతినగరం సీటు దక్కింది. మరో బంధువు బడికొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల సీటు దక్కింది.

ఇక సన్నిహితులు అయిన వారిలో ఎస్ కోట ఎమ్మెల్యే కడుబడి శ్రీనివాసరావు, బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు సీట్లు దక్కించుకున్నారు. పార్వతీపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సీటుకు కూడా ఢోకా లేకుండా పోయింది. రెండవసారి విజయనగరం ఎంపీ సీటుకు బొత్స బంధువు బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు.

వీటన్నిటికీ బోనస్ అన్నట్లుగా విశాఖ ఎంపీ సీటులో బొత్స సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి పోటీకి దిగుతున్నారు. ఇవన్నీ చూస్తే బొత్స జాక్ పాట్ కొట్టేశారు అని అంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న విధానం అమలు అయింది. విజయనగరంలో మాత్రం బొత్సకు అందుకు మినహాయింపు లభించింది అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు సీనియర్ నేతగా ఉండడంతో వైసీపీ హై కమాండ్ ఆయనకు ఈ ప్రయారిటీ ఇచ్చింది అని అంటున్నారు. ఈ సీట్లు అన్నీ గెలిపించుకుని వస్తే ఉత్తరాంధ్రాలో బొత్స రాజకీయానికి ఎదురు ఉండదని అంటున్నారు.