చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబునాయుడి ప్రసంగం వింటే జాలి, కోపం ఏక కాలంలో కలగకుండా వుండవు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, 14 ఏళ్ల పాటు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పని చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా తనదైన స్టైల్‌లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి చంద్రబాబునాయుడు అత్యంత దయనీయంగా మోడీపై ఆయన ఎదుట భజన చేయడం తెలుగు సమాజాన్ని నివ్వెరపరిచింది.
ఈ సభలో చంద్రబాబునాయుడు 16 నిమిషాలు ప్రసంగించారు. ఇందులో 10 నిమిషాల పాటు కేవలం మోదీని కీర్తించడానికే విలువైన సమయాన్ని వాడుకున్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. గతంలో ప్రధాని మోడీని ఉగ్రవాది అని, భార్యను చూసుకోలేని వాడు ప్రజలను ఎలా మంచిగా చూసుకుంటారని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బహుశా నాడు మోదీపై నోరు జారినందుకు, నేడు ప్రశంసలు కురిపించి, ఆయన కోపాన్ని చల్లార్చేందుకు చిలకలూరిపేట ప్రజాగళం సభను వాడుకున్నట్టుగా కనిపించింది.
“నరేంద్ర మోదీ ఇక్కడే ఉన్నాడు. ఆయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవలసింది. మేము ఎవరమూ నివారించలేకపోయాం. ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు… ఒక ప్రధానిగా ముందు చూపుతో ప్రమాదం జరుగుతుందని గ్రహించారు. ఔనా? కాదా? అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది. ఎవరికైనా అనుమానం వుందా తమ్ముళ్లు. మీరంతా మోదీ నాయకత్వంలో అండగా వుంటామని చెప్పడానికి వచ్చారు. మోదీకి స్వాగతం పలకడం అంటే…రాష్ట్రంలో ఇళ్లలో ఉన్నవారికి కూడా వినపడేలా గట్టిగా చప్పట్లు కొట్టాలి.
మోదీ ఒక వ్యక్తి కాదు. భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే సంక్షేమం. మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే సంస్కరణ. మోదీ అంటే భవిష్యత్తు. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భారత్, జల్‌జీవన్ లాంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీ. సంపద సృష్టించిన వ్యక్తి మోదీ. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణలతో దేశ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ.
ప్రధాని నినాదం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్. వీటితో దేశానికి నమ్మకాన్ని కలిగించిన శక్తిమంతమైన నాయకుడు నరేంద్ర మోదీ. కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా సమయ స్ఫూర్తితో వ్యవహరించి మన ప్రాణాల్ని కాపాడిన వ్యక్తి మోదీ. ఔనంటే గట్టిగా చప్పట్లు అభినందించండి.వంద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి, దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి. అమెరికా, చైనా దేశాలకు దీటుగా మన ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చే శక్తి, సామర్థ్యం మోడీకి ఉన్నాయి.
పేదరికం లేని దేశం మోదీ కల, ఆయన సంకల్పం. పేదరికం లేని రాష్ట్రం చేయడం మన కల. అందుకే ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం వుంది. ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ ఒన్‌గా తీర్చిదిద్దే శక్తి, సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీకే ఉన్నాయి. అంతేకాదు, భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం. ఇప్పటికే జరుగుతా వుంది. భవిష్యత్‌లో ఈ దేశాన్ని పేదరికం లేకుండా తయారు చేసే శక్తి కూడా ఆయనకే ఉంది”
ఈ విధంగా మోదీపై ఆకాశమే హద్దుగా చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. బహుశా మోదీకి తెలుగు అర్థమై వుంటే, తనపై బాబు అతిశయోక్తులకి సిగ్గుపడే వారేమో! మోదీపై చంద్రబాబు పొగడ్తలను విన్న వాళ్లకు…ఆయన ఎంతగా భయపడుతున్నారో అనే భావన కలుగుతుంది. ఇది ఎన్నికల శంఖారావం సభ కాకుండా, మోదీ భజన సభ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలిగించింది. అసలే మోదీపై టీడీపీ శ్రేణులు కోపంగా ఉన్నాయి. అలాంటి మోదీపై ప్రశంసలు కురిపిస్తున్న చంద్రబాబును సొంత పార్టీ శ్రేణులే ఈసడించుకునే పరిస్థితి.