ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై యీ ఫిబ్రవరి 24 నాటికి రెండేళ్లయింది. అది ఆరంభించినప్పుడు యిన్నాళ్లు నడుస్తుందని ఎవరూ అనుకోలేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు) సహాయంతో రష్యాను కొట్టిపారేస్తామని ఉక్రెయిన్ అనుకుంటే, చిన్న దేశమైన ఉక్రెయిన్ను మహా అయితే ఒక నెలలో తొక్కి పారేయగలమని రష్యా అనుకుంది. కానీ అలా జరగలేదు. ప్రపంచ యుద్ధాల బాణీలో యిది సంవత్సరాల పాటు సాగుతోంది. మధ్యప్రాచ్యంలో అనేక యుద్ధాలు జరిగినా అవి ప్రపంచాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ యీ యుద్ధం వలన ఆ రెండు దేశాలే కాదు, ప్రపంచ దేశాలన్నీ నష్టపోయాయి. ఎంతో ప్రాణనష్టం జరిగింది. దానికి మించిన ఆర్థిక సంక్షోభం కలిగింది. అమెరికా, ఇయు బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం, ఆయుధసాయం అందించాయి. ఐఎమ్ఎఫ్ ద్వారా 15.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేయించాయి. యుద్ధంలో పాల్గొంటున్న దేశానికి ఐఎమ్ఎఫ్ సాయం చేయడం యిదే ప్రథమం.
రష్యా నష్టపోయిన మాట వాస్తవమే కానీ అది ఎలాగోలా నెట్టుకొచ్చేస్తోంది. అమెరికా, ఇయు దుంపనాశనం చేద్దామనుకున్న పుటిన్ ఎక్కడా తగ్గటం లేదు. తాజాగా తన ప్రత్యర్థి నావెల్నీని జైల్లో చంపించేసి, మళ్లీ అధ్యక్షుడిగా నెగ్గబోతున్నాడు. అస్తవ్యస్త అఫ్గనిస్తాన్ నిష్క్రమణతో మసకబారిన తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి బైడెన్ తెచ్చిపెట్టిన యీ యుద్ధం వలన అతను కానీ, అమెరికా కానీ, యూరోప్ కానీ ఏమైనా బావుకుందా అంటే ఏమీ లేదనే అనిపిస్తోంది. అయినా బడాయి మాత్రం ఎక్కడా తగ్గలేదు. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా రష్యాపై కొత్తగా 500 ఆంక్షలు విధించింది. ఇన్నాళ్లూ అమెరికా చెప్పినట్లే ఆడి, బావుకున్నది ఏమీ కనబడకపోయినా, అమెరికా కంటె ఎక్కువగా నష్టపోయినా, విధానాన్ని సమీక్షించుకోని ఇయు, రాబోయే ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే యీ స్థాయిలో సహకారం అందదని బెంగపడుతోంది.
ముందుగా యుద్ధం వలన జరిగిన నష్టం గురించి చెప్పాలంటే, మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య 5 లక్షలు దాటినట్లు అంచనా. వీరిలో 3 లక్షల మంది దాకా రష్యన్లు ఉన్నారట. సివిలియన్స్ మాట కొస్తే 12 వేల మంది ఉక్రెయిన్లు చనిపోయారు, 20 వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. ఉక్రెయిన్ పౌరులు 60 లక్షలమంది విదేశాలకు తరలి వెళ్లిపోయారు. 40 లక్షల మంది దాకా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోయారు. దాని జనాభా 4.25 కోట్లు కాబట్టి దాదాపు 25% మందికి స్థానచలనం కలిగిందన్నమాట! 20% భూభాగాన్ని రష్యాకు కోల్పోయింది కానీ దానిలో కొంత తిరిగి తమ వశమైందని ఉక్రెయిన్ అంటోంది. కనీసం 18% ఐనా రష్యా అధీనంలో ఉందంటున్నారు. ఫిబ్రవరి రెండవ వారంలో రష్యా అవిదీవ్కా పట్టణం నుంచి ఉక్రెయిన్ను తరిమివేసింది. దీంతో దోన్బాస్ ప్రాంతం లోని రెండు తూర్పు పట్టణాలు రష్యా అధీనంలో ఉన్నట్లయింది. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడైన జెలెన్స్కీ సైన్యాధ్యక్షుడు జలూజినీని పదవిలోంచి తొలగించాడంటేనే ఆ దేశం ఓటమి బాటలో ఉన్నట్లు తేటతెల్లమౌతోంది. జెలెన్స్కీకి కీవ్ మేయర్‌తో కూడా విభేదాలున్నాయి. జెలెన్స్కీ సామర్థ్యంపై దేశంలో, విదేశాలలో నమ్మకం సడలుతోంది. దాన్ని నివారించడానికి ద్వితీయ వార్షికోత్సవం నాడు అతను ఇటాలీ, బెల్జియం, కెనడా అధిపతులతో పాటు ఇయు కమిషన్ ప్రెసిడెంటును కూడా కీవ్‌కు ఆహ్వానించి మాట్లాడించాడు.
రష్యా యుద్ధం ప్రారంభమైన నెల్లాళ్లలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వరకు దాదాపు వచ్చేశాయి. కానీ ఉక్రెయిన్ దాన్ని ఎదిరించి, నిలవరించ గలిగింది. కానీ సెప్టెంబరు నాటికి రష్యా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించగలిగింది. 2023 మే నాటికి మాస్కోలో పుటిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకుని వెళ్లాయి. ఆ తర్వాతి నుంచి కొద్దికాలంగా డ్రోన్ల యుద్ధమే నడుస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా ఆదాయానికి 433 బిలియన్ డాలర్ల మేర గండి కొట్టామని అమెరికా, ఇయు చెప్పుకుంటున్నాయి కానీ, ఇండియా సహాయంతోను, నేరుగాను జరుగుతున్న చమురు అమ్మకాలతో (ప్రస్తుతం బారెల్ 80 డాలర్లు ధర ఉంది) ఆర్జించిన లాభాలతో రష్యా స్వయంగా ఆయుధాలను విపరీతంగా తయారు చేసుకుంటోంది. సైన్యాన్ని పెంచుకుంటోంది. ఉక్రెయిన్ సంగతి చూడబోతే పరుల ఆయుధాలపై ఆధారపడవలసిన అగత్యం ఉంది. అవి ఎంతకాలం యిస్తాయో తెలియదు.
రష్యాకు అవసరమైన డ్రోన్లు, క్షిపణులు ఇరాన్, ఉత్తర కొరియాలు అందిస్తున్నాయి. సైనికులకు కావలసిన సామగ్రిని తుర్కియే సరఫరా చేస్తోంది. చైనా నుంచి పేలుడు పదార్థాల్లో ఉపయోగించే రసాయనాలు వస్తున్నాయి. గత రెండేళ్లలో అమెరికా వివిధ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఉన్న 30 వేల కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తుల్ని స్తంభింప చేశారు కానీ స్వాధీనం చేసుకోలేదు. అలా చేసుకుంటే యిలాటి పరిస్థితుల్లో తమకూ యీ గతి పడుతుందని భయపడి, యితర దేశాలు ఎలర్ట్ అయి అమెరికా డాలర్ల రూపంలో నిధులు డిపాజిట్ చేయడం మానేస్తాయని అమెరికాకు బెదురు. పాశ్చాత్య దేశాలు రష్యాపై మొత్తం 18 వేల రకాల నిబంధనలు విధించాయట. 300 బిలియన్ డాలర్ల ఆస్తులను స్తంభింప చేశాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి రష్యాను వెలి వేశాయి. అయినా రష్యాకు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆయుధాల తయారీకి వసతులున్నాయి. మ్యాన్‌పవర్ ఉంది. ఉక్రెయిన్‌కు అవి లేకపోవడం లోటుగా ఉంది.
పదవీచ్యుతి పొందిన ఉక్రెయిన్ సైన్యాధ్యక్షుడైన జలూజినీ గురించి చెప్పాలంటే ఒక సైనికుల కుటుంబంలో 1973లో పుట్టాడు. సైన్యంలో చేరాడు. క్రమేపీ ఆర్మీలో ఎదిగాడు. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు చాలా ఆవేదనకు గురై రష్యాపై కోపాన్ని పెంచుకున్నాడు. 2019లో జెలెన్స్కీ దేశాధ్యక్షుడయ్యాక యితన్ని 2021 జులైలో కమాండర్ యిన్ చీఫ్‌గా నియమించాడు. అది జరిగిన ఏడు నెలలకు రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తింది. రష్యా దాడిని ఉక్రెయిన్ ఎదుర్కోలేదేమోనన్న భయంతో యుద్ధప్రారంభానికి ముందే అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు తమ ఎంబసీలను కీవ్ నుంచి పోలండ్ సరిహద్దుల్లో ఉన్న ల్వీవ్ నగరానికి తరలించాయి. కానీ జలూజినీ ఆత్మవిశ్వాసంతో రష్యాను ఎదుర్కున్నాడు. అది చూసి పాశ్చాత్య దేశాలు ఆయుధాల సరఫరాను ముమ్మరం చేశాయి.
జలూజినీ రణనీతి మొదట్లో బాగా పని చేసింది. అందరూ అతన్ని కొనియాడారు. ఐరన్ జనరల్ అనే బిరుదు యిచ్చారు. కానీ 2023 జూన్‌లో ఉక్రెయిన్ కౌంటర్ అఫెన్సివ్ ప్రారంభించే నాటికి రష్యా బలాన్ని పెంచుకుంది. 3 లక్షల మంది సైన్యాలను సమకూర్చుకుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా దెబ్బతిన్న ఆయుధాల ఉత్పత్తిని సరి చేసుకుని ఆయుధాలు సమకూర్చుకుంది. 2003లో 1530 టాంకులను, 2518 ఆర్మర్డ్ వెహికిల్స్‌ను తయారు చేసుకుందట. పుటిన్ తన కమాండర్‌ను కూడా మార్చి దీర్ఘకాలిక యుద్ధానికి సమాయత్తమయ్యాడు. కానీ ఉక్రెయిన్‌కు అంత సస్టయినింగ్ పవర్ లేదు. బయట నుంచి వచ్చే ఆయుధాలపై ఆధారపడి ఉంది కాబట్టి త్వరగా యుద్ధాన్ని ముగించాలని, కౌంటర్ అఫెన్సివ్కు దిగింది. అది కౌంటర్ ప్రొడక్టివ్ అయి, వ్యతిరేక ఫలితాల నిచ్చింది. భారీ నష్టాలు చవి చూసింది. కొత్త ప్రాంతాలేవీ స్వాధీనం చేసుకోలేక పోయింది.
2023 నవంబరులో జలూజినీ ‘‘ఎకనమిస్ట్’’లో ఒక వ్యాసం రాస్తూ ‘మొదటి ప్రపంచ యుద్ధంలో లాగానే యీ యుద్ధం కూడా స్తబ్దంగా, శక్తి హరింపచేసే దశకు చేరింది. దీనివలన రష్యా లాభపడుతుంది.’’ అన్నాడు. తన దేశాధ్యక్షుడు జెలెన్స్కీని ‘‘మాకో 5 లక్షల మంది సైనికులను సమకూర్చండి.’’ అని బహిరంగంగా అడిగాడు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ నుంచి 60 లక్షల మంది ప్రజలు విదేశాలకు తరలి వెళ్లిపోతూంటే సైన్యంలో కొత్తగా చేరేవారెవరు? ఈ వ్యాసం వెలువడ్డాక దేశాధ్యక్షుడికి, సైన్యాధ్యక్షుడికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటారు. ‘సైన్యాన్ని రీఆర్గనైజ్ చేయాలి. నువ్వు దిగిపో.’’ అని జెలెన్స్కీ యితన్ని అడిగాడు. ఇతను నిరాకరించడంతో చివరకు ఫిబ్రవరి 8న యితన్ని తీసివేసి, యితని స్థానంలో సిరిస్కీ అనే అతన్ని వేశాడు.
ఉక్రెయిన్‌కు ఇంటర్నెట్ కష్టాలు కూడా వచ్చిపడ్డాయి. యుద్ధప్రారంభానికి ముందు ఉక్రెయిన్‌కు శాటిలైట్ సర్వీసెస్ అందిస్తున్న అమెరికా బేస్డ్ వయాశాట్ శాటిలైట్ కంపెనీలో రష్యా మాల్వేర్ ప్రవేశపెట్టి, ఉక్రెయిన్ మిలటరీ కమాండ్ సిస్టమ్ పని చేయకుండా చేసింది. అప్పుడు ఉక్రెయిన్ ఉప ప్రధాని ఫెడోరోవ్ టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్‌ను ఆదుకోమని కోరాడు. అతను తన లో-ఎర్త్ ఆర్బిట్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ అందించే స్టార్‌లింక్ సేవలు ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని ఉక్రెయిన్‌కు కల్పించాడు. క్రమేపీ రష్యా వాళ్లు అరబ్ దేశాల ద్వారా స్టార్‌లింక్ టెర్మినల్స్ కొని, వాటిని తాము ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో వాడడం మొదలుపెట్టారు. దీనికి ఉక్రెయిన్ అభ్యంతర పెడితే అలాటిదేమీ జరగటం లేదని స్టార్‌లింక్, రష్యా దబాయించాయి.
ఇన్నాళ్లు యుద్ధం కొనసాగడం మస్క్‌కు చికాకెత్తించింది. ఉక్రెయిన్‌తో ‘మీ కోసం నేను నెలకు 20 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాను. ఎల్లకాలమూ ఉచితంగా యివ్వడం నా వల్ల కాదు.’ అంటూ ‘మీరు రష్యాతో సంధి చేసుకోవడం మంచిది. క్రిమియాను మీరు రష్యాకు అప్పగించి, యుద్ధం విరమించండి.’ అని సలహా యిచ్చాడు. అది ఉక్రెయిన్‌కు రుచించలేదు. అప్పుడు అమెరికా రంగంలోకి దిగి పెంటగన్ ద్వారా ఉక్రెయిన్‌కు యిచ్చే సేవల విషయంలో స్టార్‌లింక్‌తో ఒప్పందం చేసుకుంది. మస్క్‌కు డబ్బు వచ్చినా యుద్ధం పట్ల అతని ఉద్దేశం గ్రహించిన ఉక్రెయిన్ అతన్ని నమ్మడం మానేసింది. కానీ దానికి గత్యంతరం లేదు.
ఒక స్థాయికి మించి ఉక్రెయిన్‌కు సాయం చేయడం రిపబ్లికన్లకు యిష్టం లేదు. నాటోలో కొన్ని దేశాలు యుద్ధభారాన్ని తమపై మోస్తున్నాయని వారి ఫిర్యాదు. ఆ దేశాలన్నీ తమ జిడిపిలో కనీసం 2% డిఫెన్సు వ్యయానికై కేటాయించి, దాన్ని యిటువంటి అవసరాలకు వెచ్చించాలని వాళ్ల పట్టుదల. అది మిగుల్చుకుని ఆ భారాన్ని తమపై పెడితే ఎలా? అని వారి ప్రశ్న. ఉక్రెయిన్‌కు మరో 6000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి అమెరికా సెనేట్ ఫిబ్రవరి మధ్యలో ఆమోదం తెలిపినా రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న కాంగ్రెసులో దాన్ని తిరస్కరించారు. ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు నాటోని రద్దు చేసే ఆలోచన చేశాడు. ఇప్పుడు మళ్లీ అధ్యక్షుడైతే 2% డిఫెన్స్‌కి కేటాయించని దేశాలకు తను సహకరించనని యిప్పుడే చెప్పేశాడు. మొత్తం నాటోలో 31 దేశాలుంటే ఆపాటి కేటాయింపు చేయని దేశాలు 13 ఉన్నాయి. ఇటీవల ఒక ఎన్నికల సమావేశంలో ‘‘నువ్వేం చేద్దామనుకుంటే అది చెయ్యి అని నేను రష్యాకు చెప్పబోతున్నాను.’’ అన్నాడు. బైడెన్ అది తెలివితక్కువ స్టేటుమెంటు అన్నా, ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇతని వరస చూసి బ్రిటిషు జర్నలిస్టు ఒకతను ‘‘అమెరికాతో సంబంధం లేకుండా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించాలో లేదో యూరోప్ నిర్ణయించుకోవాలి.’’ అన్నాడు.
ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి యూరోపియన్ దేశాలు కొన్నిటిలో విముఖత ఉంది. వాటిలో వార్ ఫాటిగ్ (సుదీర్ఘ యుద్ధం వలన కలిగే అలసట) కనబడుతోంది. కానీ ఆయుధ పరిశ్రమలు మెండుగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ మాత్రం కొనసాగాలని పట్టుబడుతున్నాయి. జర్మనీ తన ఆయుధాలను ఆధునీకరించడానికి డిజిపిలో 5% అదనంగా ఖర్చు పెడతానని అంటోంది. దాని ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదు. అయినా మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ (ఎంఐసి)లు పెడతానంటోంది. ఇతర దేశాలను పెట్టమని ప్రోత్సహిస్తోంది. కోల్డ్ వార్ భయం తగ్గాక యూరోపియన్ దేశాలన్నీ తమ రక్షణ వ్యయాన్ని తగ్గించుకుని దాన్ని విద్య, వైద్యం, పెన్షన్లపై ఖర్చు పెట్టి జీవననాణ్యతను పెంచాయి. కోవిడ్ వచ్చినపుడు అవన్నీ మానేసి, వాక్సిన్లు కొనడానికే ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ధర్మమాని మళ్లీ ఆయుధాలపై ఖర్చు పెట్టాలని జర్మనీ, ఫ్రాన్స్ వాదిస్తున్నాయి.
వీళ్ల ఉద్దేశాలు గమనించిన తక్కిన దేశాలు యుద్ధం పట్ల అయిష్టం ప్రకటిస్తున్నాయి. బ్రిటన్ మాత్రం తాజాగా 10.8 మిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించింది. దాన్ని అక్కడి ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారో తెలియదు. ఇప్పటికే అధికార పార్టీ ఉప ఎన్నికలలో ఓటమి చవి చూస్తోంది. జర్మనీ కంటె ఫ్రాన్సు మరింత దూకుడుగా ఉంది. ఫిబ్రవరి ఆఖరి వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్ మాట్లాడుతూ ‘రష్యాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవ నివ్వకూడదు. అవసరమైతే వెస్టర్న్ గ్రౌండ్ ట్రూప్స్ ఉక్రెయిన్‌కి వెళ్లి పోరాడాలి.’ అన్నాడు. అతని మాటలను జర్మనీతో సహా అనేక యూరోపియన్ దేశాలు ఖండించాయి.
రష్యా తన సైన్యాన్ని పెంచుకోవడానికి భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి యితర దేశాల నుంచి రిక్రూట్ చేసుకుంటోంది. 15 వేల మంది తమ దేశస్తులను రష్యా సైన్యంలో చేర్చుకుందని నేపాల్ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ నుంచి కొందరు యువకులు రష్యా సైన్యంలో చేరడం, ఉక్రెయిన్ యుద్ధంలో మరణించడం కూడా మేగజైన్లలో వచ్చింది. ఒక రిక్రూటింగు ఏజన్సీ వీళ్లందరికీ వీసాలు సంపాదించి యిస్తోంది. వీళ్లలో కొందరికీ పెద్దగా చదువు లేకపోయినా ఐటీ ప్రొఫెషనల్స్ అనే పేరుపై రష్యాలో ఐటీ కంపెనీలో పని చేయడానికి వెళ్తున్నట్లు వీసాలు తయారు చేయించి పంపుతున్నారు. అక్కడికి వెళ్లాక ఉక్రెయిన్‌కి వెళ్లాలని చెప్తున్నారు. వెళ్లినవారిలో 10-15% మంది వెనక్కి వెళ్లిపోతున్నారు. తక్కినవారు అక్కడే ఉండిపోతున్నారు. నెలకు రూ.2 లక్షల జీతమని, రేషన్లు ఫ్రీ అని, సైన్యంలో పని చేస్తే రష్యా పౌరసత్వం యిస్తారని వాళ్లకు ఆశ పెడుతున్నారు. కొద్దిపాటి తర్ఫీదు యిచ్చి రణరంగానికి పంపేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో యిద్దరు భారతీయులు మరణించారన్న వార్తలు రావడంతో సిబిఐ దృష్టి యీ రిక్రూటింగు ఏజంట్లపై పడింది.
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఏ యుద్ధమూ ఉక్రెయిన్ యుద్ధమంత కాలం నడవలేదు. దీనికి గల కారణాలేమిటో స్టాన్లీ జానీ అనే జర్నలిస్టు చక్కగా వివరించారు. ఆయన ప్రకారం పుటిన్ జార్జియా (2008) క్రిమియా (2014) యుద్ధాలలాగానే యిది కూడా చప్పున ముగిసిపోతుందని లెక్క వేసుకుని 2 లక్షల మంది సైనికులతో ఉక్రెయిన్‌పై దాడి చేశాడు. కానీ పాశ్చాత్య దేశాలు ఆయుధసహాయం, మిలటరీ సహకారం, కిరాయి సేనలతో ఉక్రెయిన్‌కు అండగా నిలవడంతో అది సాధ్యపడలేదు. 2022లో ఖార్కీవ్ నుంచి తన సేనలు వెనక్కి తగ్గరావలసి రావడంతో పుటిన్ తన రణతంత్రాన్ని మార్చాడు. అఫెన్స్‌ను తగ్గించుకుని, వెయ్యి కి.మీల పొడవున్న తన సరిహద్దును డిఫెండ్ చేసుకోవడంపై దృష్టి సారించాడు. 8 నెలల క్రితం ఉక్రెయిన్ కౌంటర్ అఫెన్సివ్ ప్లాన్ చేసినప్పుడు వాళ్లను బాఖ్ముత్ దగ్గర నిలవరిస్తూ, తక్కిన చోట తన బలాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
దానితో ఉక్రెయిన్ కౌంటర్ అఫెన్సివ్ విఫలమైంది. అమెరికా, యూరోప్ నుంచి తెచ్చుకున్న ఆయుధాలన్నీ ఆ ప్రయత్నంలో ఖర్చయిపోయాయి. సైన్యమూ తరిగిపోయింది. కొత్తగా చేరేవాళ్లు లేరు. అమెరికా నుంచి సాయం వస్తుందేమోననుకుంటే రిపబ్లికన్లు అడ్డుకుంటున్నారు. దీర్ఘకాలిక యుద్ధాన్ని రష్యా తట్టుకోగలిగింది కానీ ఉక్రెయిన్ తట్టుకోలేక పోయింది. వీళ్లు బలహీన పడిన విషయం గ్రహించి గత డిసెంబరు నుంచి రష్యా అఫెన్సివ్ పెంచింది. మరీంకాను గెలిచింది. ఫిబ్రవరిలో అవిదీవ్కాను ఆక్రమించింది. ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన అమెరికా, ఇయుకు యికపై ఏం చేయాలన్న దానిపై స్పష్టత లేదు. ఉక్రెయిన్‌కు ఆయుధసహకారం, రష్యాపై ఆంక్షలు అనే రెండు అస్త్రాలను వాళ్లు నమ్ముకున్నారు. ట్రంప్ మళ్లీ గెలుస్తాడేమోనన్న అంచనాలతో మొదటి అస్త్రం బలహీన పడుతోంది.
ఇక రెండవ దానికి వస్తే పెట్రోలు కొనకపోవడం ద్వారా రష్యాను యిరకాటంలో పెట్టామని వారనుకున్నారు. కానీ రష్యా తన పెట్రోలును తక్కువ ధరలకు చైనా, ఇండియా, బ్రెజిల్‌లకు అమ్ముకుంటూ వచ్చింది. గతంలో పెట్రోలు రవాణాకు యూరోపియన్ ఓడలు వాడుకునేది. ఇప్పుడు తనే సొంత ఓడలు సమకూర్చుకుని రవాణా చేస్తోంది. ఈ జనవరిలోనే చమురు అమ్మకాల ద్వారా రష్యా 15.6 బిలియన్ డాలర్లు ఆర్జించింది. క్రితం ఏడాది వేసవిలో యిది 11.8 ఉంది. ఆర్మీనియా, టర్కీ వంటి మిత్ర దేశాలలో షెల్ కంపెనీలు పెట్టి, వాటి ద్వారా వాణిజ్యాన్ని సాగిస్తోంది. పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న చైనా రష్యాతో వ్యాపారాన్ని పెంచుకుని రష్యా కుప్పకూలకుండా చూసింది. రష్యా అంతర్జాతీయ వ్యాపారానికై డాలరు వాడడం మానేసి చైనీస్ యువాన్ వాడడం మొదలుపెట్టింది. తన డిఫెన్స్ బజెట్‌ను 70% పెంచింది. అమెరికాతో శత్రుత్వం వహిస్తున్న ఇరాన్, ఉత్తర కొరియాలతో వ్యాపారాన్ని పెంచుకుని, వారి నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది.
కానీ రష్యా యితర రకాలుగా నష్టపోతోంది. దాని సరిహద్దుల్లో ఉన్న ఫిన్లండ్, స్వీడన్ నాటోలో చేరాయి. ఉక్రెయిన్ పౌరులపై జరుగుతున్న మారణకాండను ప్రపంచం ఏవగించుకుంటోంది. రష్యాలో ప్రజాస్వామ్యం ఉండి ఉంటే రష్యన్లు పుటిన్ విధానాల పట్ల తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చ గలిగేవారు. కానీ పుటిన్ పూర్తిగా నియంతగా మారి, తనను విమర్శించిన వారందరినీ కడ తేరుస్తున్నాడు. ఇటు జెలెన్స్కీ తన బలాబలాలు సరిగ్గా అంచనా వేసుకోకుండా తన దేశాన్ని యుద్ధంలోకి దింపాడు. అమెరికా, యూరోప్‌లు ‘చేసింది చాల్లే, యికపై మా వల్ల కాదు’ అంటూ ఎప్పుడు మొండి చేయి చూపిస్తాయో తెలియదు. మనం సానుభూతి చూపవలసినది రష్యన్, ఉక్రెయిన్ ప్రజల మీద మాత్రమే. పాలకులపై కాదు. (ఫోటో – 2024 ఫిబ్రవరి 19 నాటికి రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాలు, నగరాలు చూపే మ్యాప్, పక్కన పుటిన్, జెలెన్స్కీ, పదవీచ్యుతుడైన జలూజినీ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)