చిలకలూరిపేట సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రధాని మోడీ ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. మోడీ ప్రసంగం సాగినంత సేపూ… జగన్‌ను ఇదిగో ఈ క్షణంలో తిడతారేమో అని ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదురు చూశారు. జగన్‌ను ఏమీ అనకుండానే మోదీ ప్రసంగం పూర్తి కావడంతో వారంతా ఒక్కసారిగా నీరుగారి పోయారు.
మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌కు మోదీ గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒకట్రెండు సందర్భాల్లో జగన్ పేరు ప్రస్తావన తెచ్చినప్పటికీ, జనరల్‌గా విమర్శలు చేశారే తప్ప, ఎక్కడా తీవ్ర విమర్శలకు వెళ్లపోవడం గమనార్హం. ఈ సభలో ప్రధాని మోదీ ప్రధానంగా జూన్ 4న ఫలితాలు వెలువడుతాయని, ఆ రోజు ఎన్డీఏకి 400 సీట్లు రావాలని పదేపదే అన్నారు. కావున అందరూ ఎన్డీఏకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఆయన విమర్శలేంటో చూద్దాం.
ఏపీ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారు. ఒకటి దేశంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి తీసుకురావడం, రెండోది రాష్ట్రంలో కూడా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించడం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరికి మించి మరొకరు అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ వేర్వేరు కాదని ఆయన అన్నారు. రెండు పార్టీలు ఒకే ఒరలోని రెండు కత్తులన్నారు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్, వైసీపీకి నాయకత్వం వహిస్తున్నారని మోడీ విమర్శించారు. వైసీపీ తనపై వ్యతిరేకతను కాంగ్రెస్‌కు మళ్లించేందుకు ఆ పార్టీని ప్రయోగిస్తోందని ఆయన విమర్శించడం గమనార్హం.
ప్రధానంగా కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు చేయడాన్ని గమనించొచ్చు. గతంలో ఏపీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. అలాగే తెలుగు వారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించిన ఘనత ఎన్డీఏ సర్కార్‌కే దక్కుతుందన్నారు. దివంగత ఎన్టీఆర్‌ను ఆయన ప్రశంసించారు.
ఈ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తారని బాబు, పవన్, అలాగే బీజేపీలోని టీడీపీ అనుకూల నాయకులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ వారి ఆశలేవీ నెరవేరలేదు. దీంతో వారి మొహాల్లో నెత్తురు చుక్క కనిపించలేదు.