ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ అంటే మొండితనానికి కేరాఫ్ అడ్రస్. ఎవ్వరి కోసం ఎవరున్నారు.. పొండిరా పొండి.. నా కాలం కర్మం కలిసి వస్తే రండిరా రండి అనే టైపు. తనను చేసి ఓట్లు వేసారు, అందువల్ల ఈ కష్టం.. సుఖం అన్నీ తనవే అనే టైపు. అంతే తప్ప అధికారం నిలబెట్టుకోవాలంటే రాజకీయం నేర్చుకోవాలి. సామ, దాన, బేధోపాయాలు ఉపయోగించాలి అనే ఆలోచన లేదు. తెలిసిన ఉపాయం ఒక్కటే దండోపాయం. కానీ దండోపాయం అన్ని వేళలా పని చేయదు. పైగా దండోపాయం వల్ల, సరైన టైమ్ లో, ఇప్పుడు తమ టైమ్ వచ్చింది అని పగతీర్చుకునే రివర్స్ గేర్ వ్యవహారాలు కూడా వుంటాయి.
పార్టీ వదిలిపోతాము లేదా పోతారు అన్న వారిని ఒక్కరిని జగన్ వారించగలిగారా? బుజ్జగించగలిగారా? ఆపగలిగారా? లేదు..నిజానికి ఆయన అలాంటి ప్రయత్నమే చేయరు. వీళ్ల ను చూసి ఓటేయలేదు..ఓటేయరు. నిన్న అయినా, ఇప్పుడు అయినా జనం ఓటు వేసేది తనను చూసి, తనకే అని జగన్ ఆలోచన. కానీ రాజకీయం వేరుగా వుంటుందని ఆయనకు తెలుసో, తెలియదో.
నలుగురు దొంగలు కలిసి బ్రాహ్మణుడు పట్టుకెళ్తున్న మేకను కాస్తా కుక్క అని నమ్మేలా చేసి, కొట్టేసిన జానపద కథ జగన్ చదివి వుండరు. గ్లోబెల్స్ ప్రచారం అంటే ఆనాడే మొదలైంది. నలుగురు కలిస్తే, గట్టి ప్రచారం చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు అని ఆంధ్రలో ఇప్పుడు రుజువైంది. ఏడాదిన్నర క్రితం జగన్ ను ఏ విధంగా కార్నర్ చేయగలం అన్నది వైరిపక్షానికి అస్సలు ఆలోచన లేదు. జగన్ డబ్బులు వేస్తున్నారు. జనం తీసుకుంటున్నారు.
మెల్లగా ముందు రోడ్లు బాగా లేవు అని స్టార్ట్ చేసారు. రోడ్లు బాగయ్యాయి. కానీ రోడ్లు బాగా లేవు అన్న ప్రచారమే కొనసాగింది.
ఆసుపత్రులు, స్కూళ్లు ఎంత బాగు పడ్డాయో అన్నది ప్రచారంలోకి రాలేదు. ఎక్కడో ఒకటీ అరా బాగులేనివే ప్రచారంలోకి వచ్చాయి.
విశాఖ ఎంత డెవలప్ అయింది అన్నది బయటకు రాలేదు. రుషికొండ గుండు కొట్టేసారు అన్నదే ప్రచారంలోకి వచ్చింది.
అంతకు ముందు అదే రుషికొండకు గుండు కొట్టించి, హరిత కాటేజ్ లు కట్టింది చంద్రబాబు అన్నది ఎవరూ చెప్పలేదు. రుషికొండ మీద ప్రభుత్వం కట్టిన భవనాలు, జగన్ పట్టుకెళ్లిపోతాడు అన్నంత ప్రచారం సాగింది.
జనానికి చాలా మంచి జరిగిన సచివాలయాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు, ఫ్యామిలీ క్లినిక్ లు ఇవేవీ ప్రచారానికి నోచుకోలేదు.
అభివృద్ది లేదు. రాష్ట్రం నాశనం అయిపోయంది.
నాశనం.. నాశనం అనే తప్ప ఏ విధంగా నాశనం అనేది లేదు. రాష్ట్రం సర్వనాశనం అనేదే ప్రచారం.
ఈ ప్రచారం సాగి సాగి, ఇప్పుడు జగన్ అనేవాడు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాడు. భ్రష్టు పట్టించాడు అనే దగ్గరకు వెళ్లిపోయింది.
దీని వెనుక వైరిపక్షాల చాకచక్యం మాత్రమే లేదు. జగన్ స్వయంకృతాపరాధం కూడా వుంది. సగం మంత్రులను తీసేసి, కొత్త వాళ్లను తీసుకున్నారు. పాతవాళ్లు దాదాపు గా సైలంట్ అయిపోయారు. ఎప్పుడు మైక్ ముందుకు వచ్చినా ఇద్దరు ముగ్గురు తప్ప, నాలుగో వ్యక్తి లేరు 2019 ముందు మాట్లాడిన అనేకానేక మంది, పదవుల మీద పదవులు తీసుకున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు జగన్ కు మద్దతుగా మైకు ముందుకు రాలేదు.
జగన్ బాధ జగన్ పడతారు అనే ధీమా. జగన్ ది కూడా అదే వైఖరి. నలుగురిని కలుపుకుని పోవడం అన్నది జగన్ కు చేతకాదు. ఇష్టమైతే అందలం. లేదంటే వదిలేయడం. విజయసాయి వైజాగ్ ను గాడిలో పెడుతుంటూ, అందరూ కలిసి నానా యాగీ చేయించారు అదే నిజమని నమ్మి, అక్కడి నుంచి తప్పించి సుబ్బారెడ్డిని పెట్టారు. దాంతో ఏం జరిగిందో ఉత్తరాంధ్ర పార్టీ జనాలకు తెలుసు.
ఒక్క అపాయింట్ మెంట్ ఇచ్చి, ఓ రెండు మంచి మాటలు చెప్పి వుంటే రఘురామకృష్ణం రాజు వెళ్లిపోయి వుండేవారు కాదు. అలా చేయలేదు సరికదా మరింత రెచ్చ గొట్టారు. దాంతో ఆయన ఎంత యాగీ చేయగలరో అంతా చేసారు. చెల్లి షర్మిల విషయమూ అంతే, గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్వంత చెల్లి, రోడ్డు మీదకు వచ్చి అన్నకు ఓటేయవద్దు అని చెప్పే వరకు వచ్చింది.
ఇలా ఎక్కడిక్కడ తనతో వుండే జనాలు అందరినీ దూరం చేసుకున్నారు. ఒక్కరంటే ఒక్కరిని కూడా జగన్ బుజ్జగించరు. పెద్దిరెడ్డో, మరో రెడ్డో చేయాల్సిందే. దాంతో జగన్ కోటరీ బుజ్జగించిన వారు వున్నారు. జగన్ కోటరీ వద్దనుకున్న వారు వెళ్లిపోయారు.
ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం బావుకున్నారు.
ఎన్నికల ముందు రామోజీరావు ఇంటికి సిఐడిని పంపించి ఏం సాధించారు.
వాళ్లను మరింత రెచ్చగొట్టారు. మరింత కక్ష పెంచుకున్నారు. మొత్తం సర్వ శక్తులు కూడ గట్టుకున్నారు. రామోజీరావు తలుచుకోకపోతే అమిత్ షా ద్వారా ఇప్పుడు భాజపా పొత్తు సాధ్యమయ్యేదా?
ఒకరా ఇద్దరా ఎందరిని దూరం చేసుకున్నారు. చెల్లెళ్లు, తల్లి, రఘురామకృష్ణం రాజు, రామోజీరావు, పలువురు ఎంపీలు, ఇంకా..ఇంకా…
ఇప్పుడు ఎవరు మిగిలారు. జగన్ కు, జగన్ మాత్రమే మిగిలారు. డబ్బు వుండొచ్చు. ఖర్చు చేయవచ్చు.
కానీ కింది స్థాయిలో సమన్వయం చేసేది ఎవరు?
బుజ్జగింపులు చేసేది ఎవరు?
ఎవ్వరూ లేరు.
చంద్రబాబు తన పార్టీలో చెలరేగిన టికెట్ ల అలజడిని రెండు రోజుల్లో ఆర్పగలిగారు.
కానీ జగన్ అసలు ఆర్పే ప్రయత్నమే చేయరు.
ఎందుకంటే జగన్ నమ్మకం ఒక్కటే. జనం ఓటు వేసినా, ఓయకున్నా తనే కారణం, తనను చూసే, తన కోసమే అని.
కానీ ఆయనకు తెలియంది ఒక్కటే. తనకు, జనానికి అనుబంధం కేవలం బటన్ నొక్కడమే కాదు..మిడిల్ రేంజ్ నాయకులు కూడా వుండాలి అన్నదే. వాళ్లను ఆయన వదులుకుంటూ పోతున్నారు. ఈ పోవడం ఎక్కడి వరకు సాగుతుందో, జగన్ మొండితనమే గెలుస్తుందో? గుణపాఠం నేర్పుతుందో రెండు నెలలు వేచి చూస్తే కానీ తెలియదు.