వైసీపీ సిద్ధం సభలతో పోలిస్తే కూటమి ప్రజాగళం సభ వెలవెలపోయింది. తాడేపల్లిగూడెంలో గత నెలలో టీడీపీ, జనసేన ఉమ్మడి సభ నిర్వహించాయి. ఆ సభ ఏ మేరకు సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు మొక్కుబడిగా మాట్లాడ్డం, పవన్‌కల్యాణ్ అతి చేయడంతో సభ ఉద్దేశం నెరవేరలేదనే టాక్ వచ్చింది.
బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగకు ప్లాన్ చేశారు. ఈ సభకు జనం వచ్చారంటే వచ్చారని చెప్పక తప్పదు. కానీ వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలతో పోలిస్తే… కూటమి సభకు వచ్చిన జనం కనీసం 25 శాతం కూడా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా సభకు జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించలేదు. ప్రధాని మోదీ హాజరవుతున్న సభ కావడంతో జనం తరలింపునకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు.
అయినప్పటికీ జనం మాత్రం ఆ మూడు పార్టీలు ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం గమనార్హం. ఇదే వైసీపీ సిద్ధం సభలకు వచ్చిన జనంతో పోలిస్తే, కూటమి సభకు వచ్చిన జనం అంతంత మాత్రమే అని చెప్పక తప్పదు. ఉత్తరాంధ్రలో మొట్టమొదటి వైసీపీ సిద్ధం సభ జరిగింది. ఒకవైపు జన సముద్రం, మరోవైపు జల సముద్రమా? అనే రీతిలో వెల్లువెత్తారు. ఆ సభతో వైసీపీలో కొత్త జోష్ మొదలైంది. అది మొదలు పల్నాడులో నాలుగో విడత సిద్ధం సభ వరకూ ఒకదాని మించి మరొకటి సూపర్ సక్సెస్ అయ్యాయి.
దీంతో వైసీపీ సభలకు జనం వెల్లువెత్తుతున్నారనే ప్రచారాన్ని టీడీపీ, జనసేన తట్టుకోలేకపోయాయి. అందుకే ఆ సభలకు జనం రాలేదని, అంతా గ్రాఫిక్స్ మాయ అంటూ ఎల్లో మీడియా ద్వారా వైసీపీ ప్రజాదరణను తగ్గించే ప్రయత్నాన్ని గమనించొచ్చు. ఈ సభలతో వైసీపీలో ఓ రేంజ్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
కూటమి ప్రజాగళానికి మహా అయితే ఒక లక్షకు మించి జనం రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది కూడా మూడు పార్టీలు కలిసి సమీకరించిన జనం కావడం విశేషం. సభకు వచ్చిన జనంలో కూడా ఎక్కువగా టీడీపీ, అక్కడక్కడ జనసేన, బీజేపీ జెండాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కూటమిలో జోష్ నింపేలా మాత్రం జనం వెళ్లలేదన్నది వాస్తవం.