పిఠాపురంలో వ‌ర్మ‌ను న‌మ్మ‌లేం.. జ‌న‌సేన ఫీలింగ్!

పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్నారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన‌… గంట‌లోపే ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. పిఠాపురంలో పోటీ చేయాల‌ని కొన్నేళ్లుగా మాజీ…

పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్నారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన‌… గంట‌లోపే ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. పిఠాపురంలో పోటీ చేయాల‌ని కొన్నేళ్లుగా మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ క్షేత్ర‌స్థాయి వ‌ర్కౌట్ చేసుకుంటున్నారు. వ‌ర్మ‌కు వ్య‌క్తిగ‌తంగా కొంత ఇమేజ్ వుంది. 2014లో టీడీపీ టికెట్ ద‌క్క‌క‌పోతే స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొంది అంద‌రి దృష్టి ఆక‌ర్షించారు.

ఈ ద‌ఫా కూడా 2014 నాటి ప‌రిస్థితిని రిపీట్ చేస్తారేమో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వ‌ర్మ అనుచ‌రులు ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించి, ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌రిలో వుండాల్సిందే అని ఆయ‌న‌పై ఒత్తిడి తెచ్చారు. మ‌రోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు వ‌ర్మ కూడా మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు. చంద్ర‌బాబునాయుడి పిలుపు మేర‌కు ఆయ‌న విజ‌య‌వాడ వెళ్లారు. బాబుతో భేటీ అనంత‌రం వ‌ర్మ మ‌న‌సు మార్చుకున్నారు. ప‌వ‌న్ గెలుపు కోసం ప‌ని చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికారు. త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని బాబు హామీ ఇచ్చార‌ని తెలిపారు.

ఇదంతా మాట్లాడుకోడానికి, చూడ‌డానికి బాగుంది. అయితే వ‌ర్మ‌ను న‌మ్మ‌లేమ‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అంటున్నారు. ఒక్కోసారి ఒక్కో ర‌కంగా వ‌ర్మ మాట్లాడుతుంటార‌ని, నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం అని వారు విమ‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్‌కు మ‌న‌స్ఫూర్తిగా వ‌ర్మ ప‌ని చేస్తార‌ని ఎవ‌రైనా అనుకుంటే, అంత‌కంటే హాస్యాస్ప‌దం మ‌రొక‌టి లేద‌ని జ‌న‌సేన శ్రేణులు అంటున్నాయి. వ‌ర్మ‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన వాళ్లెవ‌రైనా పిఠాపురంలో ఆయ‌న ప‌ట్టు కోల్పోడానికి సిద్ధంగా వుంటారంటే న‌మ్మ‌లేకున్నారు.

ఇదంతా ప‌వ‌న్‌ను రానున్న రోజుల్లో తీవ్రంగా ఇబ్బంది పెట్టే గేమ్ ప్లాన్‌గా అభివ‌ర్ణిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌రిలో నిలిచిన త‌ర్వాత వ‌ర్మ కూడా నామినేష‌న్ వేస్తార‌ని మెజార్టీ ప్ర‌జానీకం చెబుతున్నారు. అప్పుడు ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా ఇబ్బంది త‌ప్ప‌దంటున్నారు. పిఠాపురంలో ముక్కోణ‌పు పోటీ వుంటుంద‌ని, చంద్ర‌బాబు వెన్నుపోటు రాజ‌కీయం ఏంటో త్వ‌ర‌లో ప‌వ‌న్‌కు తెలిసొస్తుంద‌ని అంటున్నారు. అనుచ‌రుల ఒత్తిడి మేర‌కు పోటీ చేయాల్సి వ‌స్తుంద‌నే మాట‌లు వ‌ర్మ నుంచి రావ‌డానికి మ‌రెంతో కాలం లేద‌నే అభిప్రాయం వెల్లువెత్తుతోంది.