ఎన్నికలకు కావాల్సినంత సమయం వుంది. దీంతో ఈ గ్యాప్‌లో కూటమిలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకోవడంపై వైసీపీ దృష్టి సారించింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మే 13న జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికలకు 50 రోజులకు పైగా సమయం వుండడంతో, దీన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ఇంత వరకూ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. టీడీపీ మాత్రం 120కి పైగా అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కొన్ని నియోజకవర్గాలపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి వుంది. అభ్యర్థుల ప్రకటనలో జనసేన, బీజేపీ బాగా వెనుకపడ్డాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు దక్కాయి.
బీజేపీ మాత్రం ఇంత వరకూ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. జనసేన మాత్రం అధికారికంగా ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. కొన్ని చోట్ల నేరుగా చెప్పి, ప్రచారం చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. అయినప్పటికీ అధికారికంగా అభ్యర్థుల ప్రకటన రాకపోవడం, కొందరు ముఖ్యులకు టికెట్లు ఇచ్చుకోలేని దయనీయ స్థితి జనసేనది.
ఈ నేపథ్యంలో కూటమికి చెందిన పార్టీల్లోని అసంతృప్తులపై వైసీపీ దృష్టి పెట్టింది. ఎన్నికలకు కావాల్సినంత సమయం వుండడం, అలాగే వివిధ కారణాలతో అసంతృప్తులంతా తమ వైపు చూస్తుండాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునే పనిలో వైసీపీ వుంది. చాపకింద నీరులా ఎన్నికల గ్యాప్ సమయాన్ని సంపూర్ణంగా వాడుకునే వేటలో అధికార పార్టీ నేతలు పడ్డారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కూటమిలో ఎక్కువ విభేదాలున్నాయి. వైసీపీ పెద్దల ఆదేశాలతో స్థానిక నాయకులు ప్రజాదరణ ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకోడానికి అన్ని రకాలుగా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఎవరికేం కావాలో వెంటనే చేయడానికి కొన్ని టీమ్‌లు క్షేత్రస్థాయిలో దిగాయి.