హిందూపురం టికెట్ కోసం సాములోరు య‌త్నం!

అప్పుడెప్పుడో తెలంగాణ బీజేపీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థి అంటూ అడావుడి చేసిన ప‌రిపూర్ణానంద ఆ త‌ర్వాత రాజ‌కీయ వార్త‌ల్లో పెద్ద‌గా నిల‌వ‌లేదు! ఆయ‌న సీఎంగా వ‌ద్ద‌ని తెలంగాణ ప్ర‌జానీకం అప్ప‌ట్లోనే తేల్చేయ‌డం ఆ త‌ర్వాత…

అప్పుడెప్పుడో తెలంగాణ బీజేపీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థి అంటూ అడావుడి చేసిన ప‌రిపూర్ణానంద ఆ త‌ర్వాత రాజ‌కీయ వార్త‌ల్లో పెద్ద‌గా నిల‌వ‌లేదు! ఆయ‌న సీఎంగా వ‌ద్ద‌ని తెలంగాణ ప్ర‌జానీకం అప్ప‌ట్లోనే తేల్చేయ‌డం ఆ త‌ర్వాత కొన్ని సంద‌ర్భాల్లో రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు చేశారాయ‌న‌! మ‌రి ఉత్త‌రాదిన కొంద‌రు కాషాయ‌ధారులు సీఎంలు, ఎంపీ అయిపోవ‌డంతో .. ముందు ముందు కాషాయ పార్టీ త‌ర‌ఫున ఇంకా అనేక‌మంది సాధుసంతులు పార్ల‌మెంట్ లో చ‌ట్టాలు చేస్తార‌నే అంచ‌నాలున్న నేప‌థ్యంలో.. ఈయ‌న‌కూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల మీద మ‌రింత‌గా మోజు పెరిగిన‌ట్టుగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగా హిందూపురం ఎంపీ టికెట్ ను ప‌రిపూర్ణానంద ఆశిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఆ పార్టీ బీజేపీకి ఆరు ఎంపీ టికెట్ల‌ను కేటాయించిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో.. అందులో హిందూపురం సీటు కూడా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డ నుంచి పోటీకి ప‌రిపూర్ణానంద ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తెలుస్తోంది.

మ‌రి ఒక‌ప్పుడు తెలంగాణ‌లో బీజేపీ సీఎం క్యాండిడేట్ ఇప్పుడు ఏపీలో ఎంపీ క్యాండిడేట్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తూ ఉండ‌టం విశేషం. అయితే తాము గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉన్న హిందూపురం టికెట్ ను తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇస్తుందా? అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేని అంశం. అయితే ఇప్పుడు బీజేపీ క‌చ్చితంగా ఓడిపోయే సీట్ల‌ను తీసుకుని స‌ర్దుకునే ప‌రిస్థితుల్లో లేదు. కాబ‌ట్టి.. హిందూపురం అడ‌గ‌టంలో వింత లేదు. మ‌రి అందుకు తెలుగుదేశం ఒప్పుకుంటే ప‌రిపూర్ణానంద పోటీ చేస్తారు కాబోలు!

ఈ మేర‌కు ఆయ‌న ఇప్ప‌టికే రాజ‌కీయం మొద‌లుపెట్టార‌క్క‌డ‌. హిందూపురానికి కూత వేటు దూరంలో.. పెనుకొండ స‌మీపంలో ఆఫీసును తీసుకొని ఆయ‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాలు చేస్తూ ఉన్నారు! అయితే ఆయ‌న జ‌నాల‌కు చేరువ అయ్యింది లేదు కానీ, టికెట్ కోసం అయితే ఈ ప్ర‌య‌త్నాలు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. హిందూపురం ఎంపీ సీటు ప‌రిధిలో బీసీల జ‌నాభా ఎక్కువ‌. ఇక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థికి టికెట్ ను ఖ‌రారు చేసింది. ఆమె ఇప్ప‌టికే ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నారు.

మ‌రి తెలుగుదేశం పార్టీ ఇక్క‌డ బోయ‌ల‌నో, కురుబ‌ల‌నో దించేతే పోటీ ర‌స‌వ‌త్త‌రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా బీజేపీ తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బీజేపీ త‌ర‌ఫున ప‌రిపూర్ణానంద పోటీ చేసినా.. బీజేపీ గుర్తే ఈ ప్రాంతంలో పెద్ద‌గా ఎవ‌రికీ తెలీదు! మ‌రి గుర్తు ఎప్ప‌టికి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి, ప‌రిపూర్ణానందను వారు ఎప్పుడు గుర్తు ప‌ట్టాలి ఇదంతా పెద్ద త‌తంగ‌మే!

మ‌రోవైపు హిందూపురం సీటును బీజేపీకి వ‌దిలితే అక్క‌డ నుంచి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి పోటీ చేస్తార‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతూ ఉంది. విష్ణు హిందూపురం ఎంపీ సీటుకు స్థానికుడు అవుతారు. అయితే బీజేపీ టికెట్ ను విష్ణుకు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు అండ్ కో ఎలాగూ ఒప్పుకోదు. బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగితే అది తాము ఆ పార్టీలోకి పంపిన వారు కావాలి త‌ప్ప ఆ పార్టీలోనే నిక్క‌ర్లు లాగులు వేసుకుని పెద్ద‌వాళ్లైన వారిని అభ్య‌ర్థులుగా దించ‌డానికి చంద్ర‌బాబు స‌సేమేరా అనొచ్చు. విష్ణు, జీవీఎల్ వంటి వారికి టికెట్ ద‌క్క‌నీయకుండా చూడ‌టానికి చంద్ర‌బాబు, బీజేపీలోకి ఆయ‌న పంపిన వారు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తారు. ఇది ప‌రిపూర్ణానంద‌కు సానుకూలాంశం!

మ‌రి స్థానికులు ఈయ‌న ఎవ‌రో కూడా తెలీదు. ఆయ‌న పోటీకి దిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌రింత సానుకూలాంశం అయ్యే అవ‌కాశాలూ ఉన్నాయి!