సీమ టీడీపీ .. స‌ల‌స‌లా కాగుతోంది!

కేవ‌లం పొత్తులే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసిన వాళ్ల‌కు అప్ప‌టిక‌ప్పుడు టికెట్లు ఖ‌రారు చేస్తున్న వైనం కూడా తెలుగుదేశం పార్టీలో బాగా ర‌చ్చ‌రేపుతున్న అంశం! గుంత‌క‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్…

కేవ‌లం పొత్తులే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసిన వాళ్ల‌కు అప్ప‌టిక‌ప్పుడు టికెట్లు ఖ‌రారు చేస్తున్న వైనం కూడా తెలుగుదేశం పార్టీలో బాగా ర‌చ్చ‌రేపుతున్న అంశం! గుంత‌క‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ విష‌యంలో గుమ్మ‌నూరు జ‌యరాం పేరు వినిపిస్తూ ఉండ‌టం టీడీపీలో గుబులు రేపుతూ ఉంది. అస‌లే గుంత‌క‌ల్ తెలుగుదేశం పార్టీకి అంత పూర్తి సానుకూల నియోజ‌క‌వ‌ర్గం కాదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్క‌డ గ‌ట్టిగా పోరాడ‌గ‌ల‌దు. ఇలాంటి నేప‌థ్యంలో.. రాత్రికి రాత్రి ఫిరాయింపుదారుకు టికెట్ కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ ర‌గిలే అవ‌కాశం ఉంది. అది కూడా ఎంత స‌రిహ‌ద్దు అయినా ప‌క్క జిల్లానే! అందునా గుమ్మ‌నూరుపై తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ ఇన్నీ కావు!

ఇక డోన్ అభ్య‌ర్థిగా ముందుగా ఒక‌రి పేరు ప్ర‌క‌టించి, ఆయ‌న చేత భారీగా ఖ‌ర్చులు పెట్టించి.. ఎన్నిక‌ల ముందు అయ‌న‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు చంద్ర‌బాబు! డోన్ అభ్య‌ర్థిగా ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డి అంటూ చంద్ర‌బాబు చాన్నాళ్ల కింద‌ట స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేశారు!

ధ‌ర్మ‌వ‌రం విష‌యంలో ప‌రిటాల శ్రీరామ్ ర‌గిలిపోవ‌డంలో వింత లేదు! గ‌త నాలుగేళ్ల‌లో ధ‌ర్మ‌వ‌రం ఇన్ చార్జిగా ప‌రిటాల కుటుంబం పాతిక కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేసింద‌ట‌! ఇప్పుడు బీజేపీ ముసుగులో వ‌ర‌దాపురం సూరి తెర‌పైకి వ‌చ్చారు. అదే ఖ‌రారు అయితే మాత్రం ప‌రిటాల కుటుంబానికి అంత‌కు మించిన ఝ‌ల‌క్ ఉండ‌దు!

అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన‌కు వెళితే అక్క‌డ ప్ర‌భాక‌ర్ చౌద‌రి రెబ‌ల్ గా పోటీకి దిగ‌డంలో వింత లేదు! క‌దిరి విష‌యంలో బీజేపీ పేరు తెర‌పైకి వ‌స్తోంది! ఇప్ప‌టికే క‌దిరిలో టీడీపీ వ‌ర‌స‌గా రెండు సార్లు ఓడింది. ఇప్పుడు బీజేపీ బ‌రిలోకి దిగితే.. అక్క‌డా టీడీపీ రెబ‌ల్ ఉన్న‌ట్టే! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. ఆ సీటును సొంతం చేసుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి!

చెప్పుకుంటూ పోతే ఇలాంటి జాబితా పెద్ద‌గానే ఉంది. ఇన్ చార్జిల‌ను తీసి ప‌క్క‌న పెట్ట‌డం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన వారిని చేర్చేసుకుని టికెట్ లు ఇవ్వ‌డం ఆ పై బీజేపీ, జ‌న‌సేన‌ల కోటాతో కొంత‌మందికి అవ‌కాశాలు పోవ‌డం, చంద్ర‌బాబు మార్కు రాజ‌కీయం వ‌ల్ల మ‌రి కొంద‌రు నిరాశావ‌హులు కావ‌డం.. ఏతావాతా సీమ టీడీపీ స‌ల‌స‌ల కాగుతోంది!