ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో ఎప్పట్లాగే రాధాకృష్ణ ఆవు వ్యాసం రాశారు. కేసీఆర్‌కి బుద్ధి చెబుతూ చంద్రబాబుని చూసి నేర్చుకోమని హితవు పలికారు. Insomnia (నిద్ర పట్టని జబ్బు) లాగా ఆర్కేకి బాబోఫినియా అనే జబ్బు వుంది. చంద్రబాబుని పొగడకపోతే నిద్ర పట్టదు. జగన్‌ని తిడుతూ, రేవంత్‌ని పొగుడుతూ, మోడీని స్మరిస్తూ , షర్మిలని ప్రశంసిస్తూ ఇలా ఏ టాపిక్ ప్రారంభించినా చంద్రబాబు భజనతో అది ముగుస్తుంది.
పిచ్చిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అది ఉన్నట్టు మనకు తెలియదు. జగన్‌ని పొగిడే వాళ్లని , లేదా సమర్థించే వాళ్లని ఆయన తీతువులు, పేటీఎం బ్యాచ్‌లు, నీలి, కూలి మీడియా, రోత పత్రిక ఇలా సూర్యరాయంధ్ర నిఘంటువు వెతికి మరీ బూతులు తిడుతూ వుంటారు. ఈ క్రమంలో తాను కూడా పచ్చ కామెర్లకి గురయ్యానని తెలుసుకోలేడు. తెలుసుకున్నా అంగీకరించడు.
కేసీఆర్ అహంకారి అని, కేసీఆర్‌తో సహా అందరికీ తెలుసు. ఇపుడు కొత్తగా చెప్పేదేమీ లేదు. ఫలితం అనుభవించాడు. కర్మ వెంటాడుతుందని కొత్తపలుకు పదేపదే చెబుతూ వుంది. అది చంద్రబాబుకి వర్తింపజేస్తూ ఏనాడైనా రాశారా? చంద్రబాబు ఎమ్మెల్యేలని కొనడం, రాజ్యసభ సభ్యుల్ని కొనడం న్యాయం అయినప్పుడు మరి ఆ పని కేసీఆర్ చేస్తే తప్పేమిటి?
ప్రజాస్వామ్యాన్ని, పత్రికా విలువల్ని పరిరక్షిస్తున్నాననే భ్రమతో తన రాతల్ని జనం విశ్వసిస్తున్నారనే నిద్ర మత్తులో ఆర్కే జోగుతున్నారు.ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని ఆత్రేయ ఎప్పుడో అన్నారు. ఆంధ్రజ్యోతి నీతులన్నీ ఇతర పార్టీలకే, చంద్రబాబుకి కాదు. అందుకే జగన్ ఎమ్మెల్యేలని చీల్చినప్పుడు ఇది తప్పు, ప్రజాస్వామ్య విరుద్ధమని ఒక్క మాట కూడా రాయలేదు. అది బాబు చాణక్య నీతి, జగన్ అహంకార ఫలితంగా కనిపించింది.
జన్మభూమి కమిటీలు జనాన్ని పీడిస్తున్నప్పుడు కొత్త పలుకు ఒక్క రోజు కూడా హెచ్చరించలేదు. వక్క పలుకులు నములుతూ విశ్రాంతి తీసుకుంది. చంద్రబాబు జైలుకి వెళ్లినప్పుడు రెండెకరాల నుంచి లక్ష కోట్ల వరకూ ఎదిగిన బాబు, ఎపుడో జైలుకి వెళ్లాల్సింది, ఇప్పటికే చాలా ఆలస్యమని రాసి వుంటే జనం చప్పట్లు కొట్టేవాళ్లు. జగన్ జైలుకెళితే జైలు పక్షి, బెయిల్ పక్షి అని రాసిన ఆంధ్రజ్యో్తికి బాబు జైలుకెళితే, అన్యాయం, అక్రమంగా కనిపించింది ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తారు.
ఆంధ్రజ్యోతి తనకు చెడ్డ చేస్తుందని జగన్‌కి తెలుసు. అయితే సాక్షికి మించిన చెడ్డ ఆంధ్రజ్యోతి మటుకే చేయగలదని చంద్రబాబుకి ఎప్పటికీ తెలియదు. శత్రువు కోసం ఆయుధం సిద్ధం చేయొచ్చు. అయితే అనుకూల శత్రువు మన చేతిలోని ఆయుధం లాగేసి, యుద్ధంలో నిలబెడతాడు. అనుకూల శత్రువుని చరిత్రలో ఎవరూ గుర్తించలేకపోయారు, ఎన్టీఆర్‌తో సహా.
2019లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతాడని ఆర్కే రాసి వుంటే ఆ రాతలకి విశ్వసనీయత వుండేది. చంద్రన్న కానుకకి జనం మైమరిచారని బాబు నమ్మితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక పత్రిక కూడా నమ్మితే దాన్ని బాకా, కాకా అనక ఇంకేమనాలి.
జగన్ వ్యతిరేక గాలి సునామీలా వుందని రాసేకొద్ది జగన్‌కి లాభం. చంద్రబాబుకి గ్రౌండ్ రియాల్టీ ఎప్పటికీ అర్థం కాదు. జగన్ తెరలు కట్టుకుంటున్నాడని అంటున్నారు కానీ, చంద్రబాబుకి ఆంధ్రజ్యోతి విదేశాల నుంచి నాణ్యమైన తెరలు తెప్పించి మరీ కడుతోంది. చంద్రబాబు కళ్లకి ఆపరేషన్ చేయించుకుంటే పొరలు మాత్రమే పోతాయి, తెరలు ఎట్లా పోతాయి?
ప్రపంచం మారుతూ వుంది. కొత్త పలుకే పాత పడింది. ప్రజల్ని నిద్ర లేపాల్సిన జర్నలిజమే తమకేంటి అంటున్నప్పుడు ప్రజలు మాత్రం అనకుండా వుంటారా?
ఆంధ్ర్జజ్యోతి తన కలం కష్టంతో ఈసారి కూడా చంద్రబాబుని ఓడించే పనిలో అలసట లేకుండా వుంది. ఈ సారి ఓడితే తర్వాత కొత్త పలుకు అవసరం వుండకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మనుగడే అనుమానాస్పదం కాబట్టి.