తెలుగుదేశం- జనసేన- బీజేపీల పొత్తుల ఉదంతం ప్రహసనంగా మారుతోంది! ఈ పొత్తు మూడు పార్టీల మధ్యన అనడం కన్నా.. ఇద్దరు వ్యక్తుల మధ్యన అనడం కరెక్ట్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీరిద్దరి మధ్యన ఈ పొత్తు ఏర్పడింది! ఈ పొత్తులో సఖ్యత ఉంది, ఈ పొత్తులో సహకారం ఉంది, పరస్పర విశ్వాసం ఉంది, ఉత్సాహం ఉంది! అయితే అది కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్యన ఏర్పడిన పొత్తులో మాత్రమే ఉంది. పార్టీల వారీగా చూస్తే.. తెలుగుదేశం, జనసేనల మధ్యన పొత్తు అనేది మిథ్యాపదార్థంగా మాత్రమే ఉంది!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వార్థం మేరకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అహం కోసం ఈ పొత్తు కుదిరింది. తెలుగుదేశం క్యాడర్ ఏమీ జనసేనతో పొత్తును కోరుకోలేదు! చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ చార్జిలు ఆది నుంచి ఈ పొత్తు పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. జనసేన పోటీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే టీడీపీ వారు రగిలిపోతూ ఉన్నారు!
తెలుగుదేశం పార్టీకి జనసేన సహకారం అవసరం అని కానీ, పవన్ కల్యాణ్ తో పొత్తు వల్ల కాపుల ఓట్లు వస్తాయనే లెక్కలు కానీ తెలుగుదేశం పార్టీలో చాలా మందికి లేవు! కేవలం ఒకటీ రెండు జిల్లాల నేతలకే కనీసం ఈ లెక్క అయినా ఉంది. మిగతా చోట్ల అదేమీ లేదు! మరి కాపుల ఓట్లు ఉన్న జిల్లాల్లో అయినా తెలుగుదేశం వాళ్లు త్యాగానికి రెడీగా ఉన్నారా? అంటే.. అలాంటి కూడా ఏమీ లేదు! పవన్ కల్యాణ్ వల్ల కాపుల ఓట్లు కావాలి కానీ, జనసేన పోటీకి లైన్ క్లియర్ చేయడానికి అయితే అక్కడ కూడా వారు సిద్ధంగా లేరు!
స్వయంగా పవన్ కల్యాణ్ పోటీకి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి కానీ సహకారం అందించడం లేదు! రచ్చరచ్చ చేశారు! పవన్ కల్యాణ్ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న భయం, భక్తి, గౌరవం ఆ స్థాయిలో ఉంది.
తెలుగుదేశం పార్టీ కమ్మ నేతలు గతంలో కూడా పవన్ కల్యాణ్ ను తూలనాడారు. 2014లో పవన్ మద్దతుతోనే తెలుగుదేశం గెలిచింది కదా.. అంటే, తన అన్నను గెలిపించుకోలేని పవన్ కల్యాణ్ మమ్మల్ని గెలిపించాడా? అంటూ వారు బాహాటంగానే ప్రశ్నించారు. అన్ని మాటలు అనిపించుకున్నా పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు పల్లకే మోస్తూ ఉన్నారు! ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోని కమ్మ వాళ్లలో పవన్ అంటే చులకన, చిన్న చూపే ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ అలాంటి అభిప్రాయాలే వారి నుంచి వ్యక్తం అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ విషయంలో వారు ఏ మాత్రం వెనుకాడరు కూడా!
జనసేన పోటీకి చంద్రబాబు కేటాయించే సీట్లలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఇన్ చార్జిలు సహకరించడం లేదు. జనసేన అంటేనే వారికి చిన్నచూపు ఉంది. అలాంటిది ఆ పార్టీ అభ్యర్థులకు వీరు జై కొట్టేదేముంది? ఎక్కడైనా చంద్రబాబే జనసేనలోకి తన వారిని పోటీ చేయిస్తుంటే మాత్రం అక్కడ క్యాడర్ కాస్త కామ్ గా ఉంది!
మరి జనసేన వైపు నుంచి పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పటికే జనసేన మీద ఆశలు, ఆశయాలు ఉన్న వారు గప్ చుప్ అయిపోయారు! తెలుగుదేశం తో పొత్తు అంటూ పవన్ కల్యాణ్ అనౌన్స్ చేసినప్పుడే చాలామంది చల్లబడ్డారు. ఇక 21 సీట్లకు పరిమితం కావడంతో మిగిలిన వారు కూడా నిశ్చేష్టులు అయిపోయారు. 21 సీట్లలో పోటీకి పవన్ కల్యాణ్ చెప్పిన ప్రవచనాలన్నింటినీ కలిపి చూస్తే.. వాటిని గొప్పగా భావించిన వారు కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
ఏపీ రాజకీయాల్లో పవన్ ను వారు ఊహించుకున్న దానికి ఈ 21 సీట్లలో పోటీకి అణుమాత్రం సంబంధం లేదు. స్వయంగా పవన్ కల్యాణ్ పోటీకే ఇప్పుడు టీడీపీలో బతిమాలాల్సుకున్న పరిస్థితి ఏర్పడింది. అది కూడా లక్ష మంది కాపు ఓట్లు ఉన్న నియోజకవర్గంలో! ఇలాంటి పరిణామాలు జనసేనలో తెలుగుదేశం పై కసిని రేపుతూ ఉన్నాయి! పవన్ కల్యాణేమో చంద్రబాబే తనకు సర్వస్వం అనే వాదనలో కొంచెం కూడా తగ్గడం లేదు కానీ, వీరాభిమానులు కూడా వాస్తవ పరిణామాలతో నిశ్చేష్టులు అవుతున్నారు! చంద్రబాబు, పవన్ ల మధ్యన పొత్తు కుదరినా.. తెలుగుదేశం, జనసేనల మధ్యన మాత్రం ఈ పొత్తు పుచ్చులా మరింది!