Advertisement

Advertisement


Home > Politics - Opinion

2024లో సౌత్ లో బీజేపీ మ‌రింత వీక్!

2024లో సౌత్ లో బీజేపీ మ‌రింత వీక్!

కేంద్రంలో మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌నే ధీమాతో క‌నిపిస్తోంది కాషాయ శిబిరం. దానికి అనేక కార‌ణాలు! అయోధ్య రామమందిర నిర్మాణంతో చేసిన హ‌డావుడి బీజేపీకి ఈ సారి హిందుత్వ వాదానికి అద‌న‌పు బ‌లం అనే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా ఉన్నాయి. మ‌రి ఆ సంగ‌తెలా ఉన్నా.. ద‌క్షిణాదిన మాత్రం క‌మ‌లం పార్టీ త‌న ప‌ట్టును మ‌రింత‌గా కోల్పోయిందా? అనే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. ఒక‌వైపు ఉత్త‌రాదిలో మ‌రోసారి క‌మ‌లం గాలి బ‌లంగా వీస్తుంద‌నే అంచ‌నాలున్నా, ఆ గాలి వింద్య ప‌ర్వ‌తాల‌ను దాటి సౌత్ ను తాకే అవ‌కాశాలు అయితే క‌నిపించ‌డం లేదు! మ‌రోసారి ఉత్త‌రాదికి, ద‌క్షిణాదికి ప్ర‌జాతీర్పులో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపించే అవ‌కాశాలే ఉన్నాయి!

క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, కేర‌ళ‌.. ఈ రాష్ట్రాల్లో మోడీ వేవ్ లో కూడా బీజేపీ చేసిన అద్భుతాలు అంతంత మాత్ర‌మే! అయితే 2024 ఎన్నిక‌ల్లో క‌నీసం 2014 లేదా 2019 ఎన్నిక‌ల నాటి ప్ర‌ద‌ర్శ‌న అయినా బీజేపీ చేయ‌గ‌ల‌దా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తూ ఉంది. దీనికీ అనేక కార‌ణాలున్నాయి!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై ఈ ప్ర‌భావం ఎంతో కొంత త‌ప్ప‌కుండా ఉంటుంది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో బీజేపీ దాదాపుగా స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు అదంత తేలికలా లేదు! అసెంబ్లీ ఎన్నిక‌ల స్థాయిలో కాక‌పోయినా క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ప‌ది ఎంపీ సీట్ల‌లో గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర‌హా స‌మీక‌ర‌ణాలే ప‌ని చేస్తే మాత్రం క‌ర్ణాట‌క‌లోకాంగ్రెస్ కు మ‌రిన్ని మంచి రోజులు ఉండ‌వ‌చ్చు కూడా!

తెలంగాణ‌లో బీజేపీ భ‌విత‌వ్యం ఏమిటో వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌లు తేల్చ‌నున్నాయి. ఒక ద‌శ‌లో తెలంగాణ‌లో అధికారం అందుకుంటుంద‌నే అంచ‌నాల‌ను క‌లిగి ఉండిన బీజేపీ ఆ త‌ర్వాత ఆ ధాటిని కొన‌సాగించ‌లేక‌పోయింది. కాంగ్రెస్ అక్క‌డ పున‌రుత్తేజం అయ్యింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. తెలంగాణ‌లోని 17 అసెంబ్లీ సీట్ల‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా త‌గ్గ‌కుండా పోరాడే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా త‌న వంతుగా పోరాడుతోంది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పోల్చిన‌ప్పుడు బీజేపీ ప‌రిస్థితి మెరుగుప‌డే ఛాన్సులైతే ఏమీ క‌నిపించ‌డం లేదు. క్రితం సారి గెలిచిన ఎంపీ సీట్ల‌ను నిల‌బెట్టుకోవ‌డం కూడా అంత తేలిక‌లా లేదు!

కేర‌ళ‌లో క‌నీసం ఒక్క ఎంపీ సీటును అయినా గెలిచి త‌మ ఉనికిని చాటాల‌ని బీజేపీ తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉంది. అక్క‌డ ప్ర‌ధానంగా నాలుగు ఎంపీ సీట్ల‌పై బీజేపీ దృష్టి సారించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అయితే ఈ సారి కేర‌ళ‌లో ఎంపీ సీట్ల విష‌యంలో కాంగ్రెస్ కూట‌మి స్వీప్ చేస్తుంద‌ని వివిధ స‌ర్వేలు అంచ‌నా వేస్తూ ఉన్నాయి! ఇలా ఈ సారి కూడా కేర‌ళ‌లో కాలిడాల‌నే బీజేపీ స్వ‌ప్నం క‌ల‌గానే మిగిలిపోవ‌చ్చు!

ఇక త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే కూడా బీజేపీకి దూరం జ‌రిగింది. సొంతంగా బ‌ల‌ప‌డ‌టానికి అక్క‌డ బీజేపీ ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు వేస్తున్నా.. అవేమీ ఫ‌ల‌ప్ర‌దంగా లేవు. త‌మిళుల ఆద‌ర‌ణ‌ను బీజేపీ పొంద‌లేని ప‌రిస్థితుల్లోనే ఉంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. మ‌రోసారి బీజేపీ అవ‌కాశ‌వాద పొత్తునే న‌మ్ముకుంది! తెలుగుదేశంతో బీజేపీ పొత్తు కేవ‌లం చంద్ర‌బాబు నాయుడి అవ‌కాశ‌వాదం కింద‌కే రాదు, ఏవో ఒక‌టో రెండు సీట్లు ద‌క్క‌క‌పోవా అనే లెక్క‌ల‌తో బీజేపీ త‌న‌కూ సిద్ధాంత‌ప‌ర‌మైన క‌ట్టుబాట్లు ఏమీ లేవ‌నే సందేశాన్నే ఇస్తోంది. ఆరు ఎంపీ సీట్ల‌లో టీడీపీ మ‌ద్ద‌తుతో బీజేపీ పోటీ చేస్తోంది. ఇది పోటీ మాత్ర‌మే!

ఒక‌వైపు ప్రాంతీయ పార్టీల‌ను కుటుంబ పార్టీలు అంటూ విమ‌ర్శిస్తూనే క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ తో, ఏపీలో టీడీపీతో బీజేపీ ఎన్నిక‌ల పొత్తుల‌తో బ‌రిలోకి దిగుతోంది! ఇదేం నైతిక‌తో క‌మ‌లం పార్టీ నేత‌ల‌కే తెలియాలి. మోడీపై 2014 నాటికి ద‌క్షిణాదిన కొంత‌మంది భార‌తీయుల్లో ఉండిన అంచ‌నాలు కూడా ఇప్పుడు ఆవిర‌య్యాయి. ప‌దేళ్ల త‌ర్వాత బీజేపీ మ‌తం, మందిరం నినాదాల‌నే మ‌రోసారి అధికారాన్ని అందుకునేందుకు వాడుకునే ప‌రిస్థితుల్లో క‌నిపిస్తోంది. ఇవి రెండూ ద‌క్షిణాదిన బీజేపీకి ఏనాడూ క‌లిసిరాని అంశాలే! ఇవే అంశాల‌తో బీజేపీ ఉత్త‌రాదిన పాగా వేసి, తిరుగులేని శ‌క్తిగా మారినా, ద‌క్షిణాదిన మాత్రం ఈ మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌డం లేదు!

-హిమ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?