టాలీవుడ్ లో రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తుంటాయి. వీటిలో కొన్ని గ్యాసిప్ లు గా మిగిలిపోతుంటాయి. మరి కొన్ని నిజాలవుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఇంట్రస్టింగ్ గ్యాసిప్ వినిపిస్తోంది. అది నిజమా… నిజమవుతుందా అన్నది తెలియదు కానీ, ఆసక్తికరంగా మాత్రం వుంది. అదేమిటంటే టాలీవుడ్ కు చెందిన ముగ్గురు ప్రముఖులు కలిసి సినిమా నిర్మాణం చేపడతారన్నది. ఎవరా ప్రముఖులు.. ఏమిటా కథ అంటే..
దర్శకుడు త్రివిక్రమ్ ఈ ముగ్గురిలో ఒకరు. త్రివిక్రమ్ స్వంత బ్యానర్ పెడతారని చాలా కాలం కిందటే వార్తలు రావడం, ఆ తరువాత ఆయన ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ పెట్టి, దాన్ని సితార సంస్థకు అనుసంధానం చేయడం జరిగిపోయింది. సితార సంస్థ నిర్మించే ప్రతి సినిమాకు ఫార్ట్యూన్ ఫోర్ కూడా భాగస్వామిగా వుంటూ వస్తోంది. అందువల్ల ఇక మరోసారి త్రివిక్రమ్ బయటకు వెళ్లి సినిమాలు చేస్తారు అని అనుకోవడానికి అంతగా ఆస్కారం లేేదు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ ముగ్గురిలో మరొకరు. ఈయన చిరకాలంగా పీపుల్స్ మీడియాలో సహనిర్మాతగా వుంటూ వస్తున్నారు. ఆయన ఆ సినిమాల్లో వాటాదారు అని అని కొందరు. కాదు జస్ట్ నిర్వాహకుడు మాత్రమే అని మరి కొందరు అంటూ వుంటారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆ సంస్థ నుంచి వివేక్ బయటకు వచ్చేస్తారు అని వినిపిస్తోంది. మే, జూన్ నాటికి వచ్చేస్తారు అని టాక్. బ్రో సినిమా దగ్గర నుంచి త్రివిక్రమ్ కు వివేక్ కు మధ్య అనుబంధం పెరిగింది. తరచు కలుస్తుంటారు కూడా. అందుకే వివేక్ కనుక బయటకు వస్తే త్రివిక్రమ్ తో కలిసి సినిమా నిర్మాణం చేపట్టే అవకాశాలు వున్నాయని టాక్.
ఇక మూడో వ్యక్తి సంగీత దర్శకుడు థమన్. ఈపేరు మాత్రం కొత్తగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు థమన్ సినిమా నిర్మాణాల జోలికి పోలేదు. థమన్ కు తివిక్రమ్ కు వున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. అందుకే వివేక్ నిర్మాతగా, త్రివిక్రమ్-థమన్ భాగస్వాములుగా వెనుక వుండి, సినిమాలు నిర్మించే ప్రణాళికలు వున్నాయని గ్యాసిప్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో వివేక్ కు మంచి పేరు వుంది. ఆయన కనుక పీపుల్స్ మీడియా నుంచి బయటకు వస్తే, కచ్చితంగా ఆయనకు సహకరించే హీరోలు చాలా మందే వుంటారు. వివేక్ కు కనుక త్రివిక్రమ్ తోడయితే ఇక చెప్పనక్కరలేదు.
అయితే త్రివిక్రమ్ కు సితార, హారిక హాసిని సంస్థలతో వున్న అనుబంధం అలాగే వుంటుందని, అదే ఫార్ట్యూన్ ఫోర్ సంస్థ ను వివేక్ పెట్టే బ్యానర్ కు కూడా జతచేస్తారని టాక్.
మరి వివేక్ అప్పుడప్పుడు త్రివిక్రమ్ ను కలుస్తుండడం వల్ల ఈ గ్యాసిప్ పుట్టిందా? లేక నిజంగా నిజమవుతుందా? అన్నది ముందు ముందు తెలుస్తుంది.