జనసేనాని పవన్‌కల్యాణ్‌ను చూసి జాలిపడాలో, కోప్పడాలో ఆ పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదు. జనసేన కీలక నాయకుడు పోతిన మహేశ్ పార్టీని వీడడానికి రెడీ అయ్యారు. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేశ్ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకే కేటాయిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువే.
అదే సీటు కోసం టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్న పట్టు పట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంటర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారింది. ఆ సీటు బీజేపీకే దక్కినట్టు తెలిసింది. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో గురువారం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తనకెంతో దగ్గరి వాడైన పోతిన మహేశ్‌కు కూడా బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ ఆ మాట అని కనీసం 24 గంటలు కూడా గడవకనే పోతిన మహేశ్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. పవన్‌కు పోతిన మహేశ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే ఇవాళ విజయవాడ వెస్ట్ జనసేన కార్యకర్తలు పోతిన మహేశ్‌ను కలిశారు.
తనకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పోతిన మహేశ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనపై జనసేన కార్యకర్తలు ఒత్తిడి చేశారు. దీంతో జనసేన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పవన్‌ను కాదనుకుని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకే పోతిన మొగ్గు చూపుతున్నారని తెలిసింది. పోతిన లాంటి వాళ్లకు కూడా పవన్ నచ్చ చెప్పలేని దుస్థితి.
పవన్‌కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పోతిన మహేశ్ గుర్తింపు పొందారు. తన రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుండడంతో పోతిన మహేశ్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తుండడం చర్చనీయాంశమైంది. పవన్ త్యాగాల మాటలను పోతిన ఖాతరు చేయడం లేదు. పొత్తు వల్ల జనసేన ఓ కీలక నాయకుడిని పోగొట్టుకోవాల్సి వస్తోంది. పోతిన మహేశ్ ఒంటరి పోరుతో కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు.