తెలుగు పార్టీలు గోడమీది పిల్లులేనా?

నిర్దిష్టంగా ఒక అభిప్రాయాన్ని తేల్చిచెప్పలేని వారిని ఏమనాలి? దేశ భవిష్యత్తునే ప్రభావితం చేయగల ఒక ఆలోచన మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పుడు,  ఆ ఆలోచన కార్యరూపం దాలిస్తే భారతదేశపు స్థితిగతులు మొత్తం మారిపోతాయి.…

నిర్దిష్టంగా ఒక అభిప్రాయాన్ని తేల్చిచెప్పలేని వారిని ఏమనాలి? దేశ భవిష్యత్తునే ప్రభావితం చేయగల ఒక ఆలోచన మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పుడు,  ఆ ఆలోచన కార్యరూపం దాలిస్తే భారతదేశపు స్థితిగతులు మొత్తం మారిపోతాయి. అంత కీలకమైన విషయంలో కూడా, తాము తమ నిర్ణయాన్ని చెప్పవలసిన చోట చెప్పకుండా దాటవేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని గోడమీది పిల్లి వాటం అనాల్సిందే కదా!

ఆ ఆరోపణ సబబు అయినప్పుడు.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే విషయంలో రెండు తెలుగురాష్ట్రాల్లోని కీలక ప్రాంతీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, భారాస, తెలుగుదేశం గోడమీది పిల్లి వాటాన్ని అనుసరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది.

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా కాలంగా సంకల్పిస్తోంది. ఎంతో పురాతనమైన ఈ ఆలోచనకు మోడీ సర్కారు పదును పెట్టింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. కేవలం పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. జమిలి ఎన్నికలు ఆలోచన కార్యరూపం దాలిస్తే.. అవి ఎలా ఉండాలనే విధివిధానాలు, అందుకు తగిన ప్రత్యామ్నాయ ఇతర ఏర్పాట్లు, సాధకబాధకాలు అన్నింటి గురించి ఈ కమిటీ అధ్యయనం చేసింది.

పార్లమెంటు, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాకుండా, మలిదశలో ఆ ఎన్నికల సమయంలోనే దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు  కూడా ఎన్నికలు పూర్తిచేయాలనేది ప్రతిపాదనల్లో కీలకాంశం. హంగ్ ఏర్పడితే మళ్లీ ఎన్నికలు నిర్వహించడం, స్థానిక సంస్థలు కూలిపోతే మిగిలిన కాలానికి మాత్రం మధ్యంతర ఎన్నికలు నిర్వహించడం వంటి ప్రతిపాదనలున్నాయి.

ఇంత కీలకమైన విషయంలో రాంనాధ్ కోవింద్ కమిటీ అభిప్రాయాలు సేకరించినప్పుడు దేశంలో మొత్తం 47 పార్టీలు వారికి స్పందించాయి. అందులో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలంగా స్పందించినట్లు ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా స్పందించిన 21,558 మందిలో 80 శాతం అనకూలంగానే ఉన్నారట. ఇక్కడ ప్రారబ్ధం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీలు తెలుగుదేశం, భారాస, వైసీపీ అసలు ఎలాంటి అభిప్రాయమూ చెప్పనేలేదు.

జమిలి ఎన్నికల వల్ల వ్యయం తగ్గుతుందని, కోడ్ రూపేణా అతితరచుగా పాలన కార్యక్రమాలు స్తంభించే ప్రమాదం ఉండదని ఒక వాదన ఉంది. అదేసమయంలో ఈ జమిలి ప్రతిపాదన జాతీయ పార్టీలకు మాత్రమే లాభసాటి అని, ప్రాంతీయ పార్టీలను కబళించే దుర్మార్గం అని ఇంకోవాదన ఉంది. ఈ వాదనల ప్రకారమే అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయి. ఎన్డీయే కూటమి పార్టీలన్నీ సమర్థించాయి.

తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు మాత్రం ఇంత కీలకమైన విషయంలో ఏ వైఖరినీ తేల్చకుండా, గోడమీది పిల్లిలా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. చివరికి మజ్లిస్ పార్టీ కూడా స్పష్టంగా తమ వ్యతిరేకతను తెలియజేసింది గానీ.. ఈ పార్టీలు వెల్లడించలేదు.