ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పుకుంటున్నారు. మధ్యవర్తిత్వం నెరపినందుకు తానే నష్టపోయానని కూడా అన్నారు.
పొత్తుల కోసం, బిజెపిని ఒప్పించడం కోసం ఒక ఎంపీ సీటును కూడా త్యాగం చేయాల్సి వచ్చినందున, అన్నయ్య నాగబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని కూడా పవన్ పాపం బాధపడ్డారు. తద్వారా.. నాగేంద్రబాబు మీద, తనమీద, జనసేన పార్టీ మీద ప్రజల్లో సానుభూతి పుట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు.
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏమిటంటే.. పొత్తులలో పవన్ కళ్యాణ్ పార్టీ ఒక ఎంపీ సీటును కోల్పోవడం వరకు మాత్రమే నిజం.. నాగేంద్రబాబు నష్టపోయారు అనేది, త్యాగం చేశారనేది అంతా అబద్ధం!
ఎంపీ సీటును త్యాగం చేశారు అనే ముసుగులో నాగేంద్ర బాబు రాజ్యసభకు ఎంపీగా పంపడానికి పవన్ కళ్యాణ్ ముందుగానే ఇటు తెలుగుదేశంతోనూ అటు భారతీయ జనతా పార్టీతోనూ కూడా ఒప్పందం చేసుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. నాగేంద్రబాబు కూడా ఇదే సేఫ్ గేమ్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ పదవిని త్యాగం చేసి పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే త్యాగమూర్తిగా ఆయన ఇప్పుడు కీర్తిని సంపాదించుకుంటారు. విపక్ష కూటమి ఎన్నికల్లో విజయం సాధించినా సాధించకపోయినా కూడా రాజ్యసభ ఎన్నికల సందర్భం తొలి అవకాశం నాగేంద్రబాబుకి ఇవ్వాలనేది ఒప్పందంలోని సారాంశం.
ఈరోజుల్లో ఎంపీ సీటుకు పోటీ చేయడం అంటే అంత చిన్న విషయం ఏమాత్రం కాదు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పరిధిలోకి దిగాలంటే.. కనీసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. తమ్ముడికి ఉన్న క్రేజ్ గెలిపిస్తుందని అతి నమ్మకాలకు వెళ్ళినందుకే గత ఎన్నికలలో దెబ్బ పడింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు నాగబాబుకు చేతకాదని కాదు, ఆమెకు ఆయన ఇతరుల నుంచి నిధులు పోగు చేసుకోలేని వ్యక్తి కూడా కాదు. అయినా సరే గెలుపు ఓటములు దైవాధీనం అయిన ఎన్నికలలో పోటీ చేయడం కంటే, త్యాగం చేయడమే మేలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎటు రాజ్యసభ ఎంపీ సీటు దక్కించుకోవచ్చు అని ఆశపడుతున్నారు.
ఈమధ్య గ్యాప్ లో పవన్ కళ్యాణ్ తాము త్యాగమూర్తులు అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుండడమే కామెడీగా ఉంది.