విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇందుకు గంటా విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అయినప్పటికీ చంద్రబాబునాయుడి నిర్ణయంలో మార్పు రాలేదు.
ఇవాళ టీడీపీ రెండో జాబితా వెలువరిస్తున్న నేపథ్యంలో, చివరి ప్రయత్నంగా బుధవారం చంద్రబాబును గంటా కలుసుకున్నారు. విశాఖలోని నాలుగు నియోజకవర్గాలు లేదా చుట్టు పక్కల ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని బాబుకు గంటా విన్నవించుకున్నారు. గంటా విజ్ఞప్తిని తిరస్కరించిన బాబు.. గతంలో ఆదేశించినట్టు చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం.
దీంతో టీడీపీ టికెట్‌పై ఆశలు వదులుకున్న గంటా శ్రీనివాసరావు, గురువారం విశాఖలో తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అనుచరుల అభిప్రాయాల్ని తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలిసింది. టీడీపీ ప్రభుత్వం దిగిన పోయిన తర్వాత, పార్టీ కష్టకాలంలో గంటా దూరంగా ఉన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం తిరిగి పార్టీకి చేరువయ్యారు. దీంతో గంటాపై చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగా ఉన్నారు.
టీడీపీ కష్టాకాలం ఉన్నప్పుడు, అండగా వుండకుండా, ఇప్పుడు టికెట్ కోసం ప్రదక్షిణలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గంటాకు బుద్ధి చెప్పడానికే, పొమ్మనకుండా పొగ పెట్టేందుకు చీపురుపల్లికి వెళ్లాలనే నాటకానికి తెరలేపారు. దీంతో తనకు టికెట్ ఇవ్వొద్దనే ఆలోచనతో టీడీపీ వుందని గ్రహించిన గంటా… భవిష్యత్ కార్యాచరణపై తర్జనభర్జన పడుతున్నారు.